కోదాడలో పండగపూట ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

5:38 pm, Mon, 15 April 19
road-accident-in-kodada-on-the-day-of-sri-rama-navami-festival

కోదాడ: శ్రీరామ నవమి రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. సీతారాముల కల్యాణం చూసి తిరిగి వస్తూ ఏడుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన సూర్యాపేట జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…

కోదాడ మండలం తమ్మరలోని రామాలయంలో శ్రీరామ నవమి వేడుకల తిలకించిన కోదాడకు చెందిన తొమ్మిది మంది భక్తులు తమ్మరకు చెందిన ఏపీ24 టీసీ 4706 నంబర్ ఆటోలో తిరిగి కోదాడకు పయనమయ్యారు. తీరా కోదాడ పట్టణంలోకి ప్రవేశించాక.. ఆటోకు ముందువెళ్తున్న బస్సులోంచి ప్రయాణికులు దిగుతుండగా.. బస్సు వెనుక వెళుతున్న కారు కూడా ఆగింది.

బస్సును దాటవేసే ప్రయత్నంలో…

అయితే ఆటోడ్రైవర్‌ మాత్రం ఆగదలుచుకోలేదు. ముందున్న కారును, బస్సును దాటవేసే ప్రయత్నంలో అనూహ్య ప్రమాదం ఎదురైంది. ఎదురుగా వస్తున్న నాగార్జున సిమెంట్‌ పరిశ్రమకు చెందిన ఏపీ16 టీహెచ్‌ 2106 నంబర్ లారీని ఆటో బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ షేక్‌అబ్బాస్‌ (48), గుండపనేని పద్మ (50), బేతు లక్ష్మయ్య (60), ఆయన భార్య నాగసులోచన (57), నారమనేని సుగుణ (45) అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో ఉన్న మరో ఐదుగురిలో అంబటి సైదమ్మ (35), వట్టికొండ శైలజ (40) ఖమ్మంలో చికిత్స పొందుతూ మరణించారు.

ఆసుపత్రిలో మరణించిన సైదమ్మ, శైలజ, గాయపడి చికిత్స పొందుతున్న రేణుక, లక్ష్మి కోదాడలోని ఒకే అపార్ట్‌మెంటులో నివసిస్తున్నారు.

తీవ్రంగా గాయపడిన రేణుకను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అలాగే కుదరవెళ్లి లక్ష్మి అనే మహిళను విజయవాడకు తీసుకెళ్లారు. గాయపడిన మరో మహిళ మంగతాయారు కోదాడలోనే చికిత్స పొందుతున్నారు.

ప్రమాదానికి ముందు ఆటో డ్రైవర్ షేక్‌అబ్బాస్‌ మొబైల్ ఫోన్‌లో మాట్లాడాడని, ఆ తరువాత గాభరా పడ్డాడు. ఆ తరువాతే అనూహ్యంగా అతడు నడుపుతున్న ఆటో ఎదురుగా వస్తోన్న లారీని ఢీకొంది.

చదవండి: అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం! ఐదుగురు మృతి!