పెళ్లైన ఏడాదికే.. 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ!

6:52 am, Sat, 6 April 19
sucide

హైదరాబాద్: పెళ్లయిన ఏడాదికే భర్త, అత్తమామల నుంచి వేధింపులు తీవ్రం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భవనం నుంచి కిందికి దూకి ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో శుక్రవారం రాత్రి జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన వినయ్‌కుమార్‌, మేఘనకు ఏడాది క్రితం వివాహమైంది. వినయ్‌కుమార్‌ మాదాపూర్‌లోని వెల్స్‌ ఫార్గో కంపెనీలో, మేఘన టీసీఎ్‌సలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లుగా పనిచేస్తున్నారు. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో భవ్యాస్‌ అఖిల ఎక్సోటికా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.

ఆర్నెల్లకే మొదలైన వేధింపులు…

పెళ్లయ్యాక ఆరు నెలలపాటు వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. మేఘనకు భర్త, అత్తమామల వేధింపులు పెరిగాయి. ఈ వేధింపులు భరించలేని మేఘన కొన్ని రోజుల క్రితం మైత్రినగర్‌లోని తన తల్లిదండ్రులకు వద్దకు వచ్చి ఉంటోంది.

ఈ క్రమంలో శుక్రవారం ఆమె భర్త వినయ్ కుమార్ నుంచి విడాకుల నోటీసులు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. శుక్రవారం ఉదయం ఆఫీసుకెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. విడాకుల నోటీసులు తీసుకొని అత్తవారింటికి వెళ్లింది. విడాకుల నోటీసు ఎందుకు ఇచ్చారంటూ వారిని నిలదీసింది.

దీంతో మాటా మాటా పెరిగి వారి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. భర్త, అత్తమామల ప్రవర్తనతో తీవ్ర మనస్థాపానికి గురైన మేఘన తాము నివసిస్తోన్న అపార్ట్‌మెంట్ 9వ అంతస్తు పైకెళ్లి అక్కడ్నించి కిందికి దూకేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. 

తన కుమార్తె మరణానికి ఆమె భర్త, అత్తమామల వేధింపులే కారణమని మేఘన తండ్రి పాండురంగారావు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.