కలప స్మగ్లింగ్ కింగ్.. తెలంగాణ వీరప్పన్ అరెస్ట్! డ్రోన్ కెమెరాల సాయంతో…

10:18 am, Wed, 10 April 19
telangana-veerappan-edla-srinu-arrest

గోదావరిఖని: అటవీశాఖ అధికారుల కళ్లు గప్పి అక్రమంగా కలప రవాణా చేస్తూ తెలంగాణ వీరప్పన్‌గా పేరుగాంచిన ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీను ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. ఈ స్మగ్లింగ్ కింగ్‌ను పట్టుకునేందుకు రామగుండం కమిషనరేట్ పోలీసులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు.

గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక మేటల కింద ఈ ముఠా సభ్యులు దాచిని కలపను డ్రోన్ కెమెరాల సాయంతో పట్టుకోవడమేకాక.. పక్కా సమాచారంతో తెలంగాణ వీరప్పన్ శ్రీనును కూడా గోదావరి ఖనిలో అదుపులోకి తీసుకున్నారు.

అతడితోపాటు కుడేదల కిషన్, కోరవేని మధుకర్, రాగం శ్రీనివాస్, ఎడ్ల సంతోష్‌లను అదుపులోకి తీసుకుని మరో 18 మందిపై కేసులు నమోదు చేశారు.

20 ఏళ్లుగా కలప స్మగ్లింగ్…

పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీను 1999లో కలప అక్రమ రవాణా వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట సైకిళ్లపై కలపను రవాణా చేసిన శ్రీను ఆ తరువాత తనకంటూ ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. గడిచిన 20 ఏళ్ల కాలంలో దాదాపు 2 వేల మంది ఓ నెట్‌వర్క్‌గా ఏర్పడి కలప అక్రమ రవాణా చేస్తూ వచ్చారు.

ఈ కలప అక్రమ రవాణా వ్యాపారంలో భాగంగా ముఠా నాయకుడు ఎడ్ల శ్రీను తన అనుచరులతో మూడు బృందాలను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి బృందం చెట్లను నరుకుతుంది, రెండో బృందం ఆ చెట్ల దుంగలను మైదాన ప్రాంతానికి తరలిస్తుంది. మూడో బృందం ఆ కలపను పట్టణ ప్రాంతాల్లోని సా మిల్లులకు తరలిస్తుంది.

డబ్బు ఆశ చూపి.. లొంగదీసుకుని..

తన కలప అక్రమ రవాణా కోసం శ్రీను డబ్బును ఎరగా వేసేవాడు. అటవీ ప్రాంతాల సమీపంలోని గ్రామాల ప్రజల్లో తనకు సహకరించేవారికి బాగా డబ్బులు ఇచ్చేవాడు. తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లోని చెట్లను కూడా నరికి అక్రమంగా రవాణా చేసేవాడు.

ఇతడికి గ్రామ సర్పంచి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు.. అలాగే అటవీశాఖ బేస్ క్యాంప్ వాచ్‌మెన్ నుంచి డీఎఫ్‌వో వరకు అందరి సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నాయని, రాజకీయ ఒత్తిళ్లతోపాటు అక్రమ సంపాదనకు అలవాటు పడిన పలువురు అటవీశాఖ అధికారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ తెలంగాణ వీరప్పన్‌కు సహకరించేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఎడ్ల శ్రీను అడవుల్లో రహస్యంగా నరికిన కలప రవాణాకు ప్రైవేట్ ఎస్కార్ట్ బృందాలను ఏర్పాటు చేసి దుంగలను నిర్ణీత గమ్యస్థానాలకు చేర్చేవాడు.

ఇతడి ముఠా సభ్యులు ఎక్కువగా గోదావరిఖనికి చెందిన సాయిరాం సామిల్స్, బాలాజీ సామిల్స్‌తో పాటు ప్రకాశం జిల్లా ఎర్రగుంట పాలెంకు చెందిన శనిగ నారాయణరెడ్డి సామిల్స్‌కు కలపను స్మగ్లింగ్ చేసే వారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

దీంతో ఈ తెలంగాణ వీరప్పన్‌ను పట్టుకునేందుకు రామగుండం కమిషనరేట్ ఉన్నతాధికారులు వలపన్ని ఎట్టకేలకు ఈ తెలంగాణ వీరప్పన్‌ను అరెస్ట్ చేశారు.