దారుణం: మహిళా తహసీల్దార్ సజీవదహనం, మాట్లాడాలంటూ వెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పంటించిన రైతు…

11:14 pm, Mon, 4 November 19

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ రైతు.. మాట్లాడాలంటూ నేరుగా తహసీల్దార్ చాంబర్‌లోకి వెళ్లి.. తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోలు పోసి నిప్పంటించి అక్కడ్నించి పరారయ్యాడు. ఈ ఘటనలో విజయా రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ అనూహ్య ఘటనతో తహసీల్దార్ కార్యాలయంలోని ఉద్యోగులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మంటల్లో చిక్కుకుని కేకలు పెడుతూ తన చాంబర్‌లోంచి బయటికొచ్చిన విజయారెడ్డిని రక్షించేందుకు కార్యాలయంలోని మరో ఇద్దరు ఉద్యోగులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే పూర్తిగా మంటల్లో చిక్కుకున్న విజయారెడ్డి కారిడార్‌లోనే కుప్పకూలి ఆ  మంటల్లోనే దహనమైపోయింది. 

మీటింగ్ అయిపోయేంత వరకు ఆగి, ఆ తరువాత…

మరోవైపు తహసీల్దార్ విజయా రెడ్డిపై పెట్రోలు పోసి నిప్పంటించిన వ్యక్తి కూడా గయపడినట్లు, ఘటన అనంతరం అతడు నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

తహసీల్దార్ చాంబర్‌లోకి బలవంతంగా ప్రవేశించబోయిన అతడ్ని లోపల మీటింగ్ జరుగుతోందంటూ తొలుత అక్కడి అటెండర్ అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే మీటింగ్ అయిపోయేంత వరకు ఆగి.. ఆ తరువాత అతడు విజయా రెడ్డి చాంబర్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. 

దాదాపు ఓ అర గంటసేపు మాట్లాడిన తరువాత.. తిరిగి బయటికి వచ్చే సమయంలో ఆ అగంతకుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే అతడు తహసీల్దార్‌పై ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి కారణాలేమిటన్నది తెలియరాలేదు. 

ఈ ఘటనపై సమాచారం అందగానే రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన ఉదంతంపై వారు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకుని ఆరా తీసినట్లు సమాచారం. అలాగే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి జరిగిన ఘటనపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. 

ఇక మంటల్లో కాలిపోయిన తహసీల్దార్ విజయారెడ్డి మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది. 

tahsildar-vijaya-reddy

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి ఫైల్‌ఫొటో