హైదరాబాద్‌లో దారుణం.. మహిళా టెక్కీని చంపి.. శవాన్ని సూట్‌కేసులో కుక్కి…

12:01 pm, Sun, 14 April 19
woman-techie-lavanya-dead-body-in-a-suitcase

హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను హతమార్చి ఆమె దేహాన్ని ఓ సూట్‌కేసులో కుక్కి ఓ చోట కాలువలో పడేశారు. ఈ దారుణ ఘటన మేడ్చల్ పరిధిలోని దుండిగల్ సూరారం కాలనీలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.

సూరారం కాలనీలోని కృషి పాఠశాల వద్ద ఆదివారం ఉదయం స్థానికులు ఓ మురుగు కాలువలో సూట్‌కేసును గమనించారు. అనుమానం వచ్చిన వారు వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

చదవండి: పెళ్లైన ఏడాదికే.. 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ!

ఆ సూట్‌కేసును బయటికి తీసి తెరవగా అందులో మహిళ మృతదేహం కనిపించింది. దీంతో షాకైన పోలీసులు ఆ మృతదేహాన్ని సూట్‌కేసు నుంచి బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అనంతరం పోలీసులు జరిపిన దర్యాప్తులో మృతురాలు.. హైదరాబాద్ శివారు ప్రాంతమైన రామచంద్రాపురానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్యగా గుర్తించారు.

మరోవైపు సదరు మహిళ కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన లావణ్య ఇలా సూట్ కేసులో శవమై లభించడం సంచలనం సృష్టిస్తోంది.

చదవండి: ఘోరం: నడిరోడ్డుపై యువకుడ్ని చావబాదిన రౌడీ షీటర్లు, ఏం జరిగింది?

అంతేకాదు, లావణ్య రెండు రోజుల క్రితం శంషాబాద్‌లోని ఓ హోటల్ వద్ద ఓ వ్యక్తితో కనిపించిందని, ఆ హోటల్లో ఓ గది కూడా వారు అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆ వ్యక్తే ఆమెను చంపి.. ఇలా సూట్ కేసులో పెట్టి సూరారం కాలనీలో పడేసి ఉంటాడని పోలీసులు తొలుత భావించినా.. అసలు నిందితుడు ఒకడేనా? లేకపోతే మరింతమంది ఉన్నారా? పథకం ప్రకారం టెక్కీ లావణ్యను హతమార్చారా? అనే కోణంలోనూ ఆలోచిస్తున్నారు.

దీనిని హత్య కేసుగా నమోదు చేసుకుని, నిందితుల జాడ కోసం శంషాబాద్, జీడిమెట్ల, రామచంద్రాపురం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

చదవండి: ఆరేళ్ల చిన్నారిపై ఘాతుకం: గొంతులో రాడ్ గుచ్చి, రోదిస్తున్నా..