మహారాష్ట్రలో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన.. ఎన్సీపీకి గవర్నర్ ఆహ్వానం

- Advertisement -

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం లేదని, సంప్రదింపుల కోసం మరో 3 రోజుల సమయం ఇవ్వాలని శివసేన గవర్నర్‌ను కోరింది.

అయితే గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి శివసేన అభ్యర్థనను తిరస్కరించిన కాసేపటికే కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించారు.

దీనికోసం ఎన్సీపీకి గవర్నర్ 24 గంటల గడువిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, ఛగన్ భుజ్బల్ ఇతర నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు.

శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముందునుంచి చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. కాగా, మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు.

అయితే, శివసేనతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ప్రభుత్వ ఏర్పాటు తమ వల్ల కాదని చేతులెత్తేసింది. మరోవైపు, శివసేనకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ కూడా నిరాకరించడంతో గవర్నర్ ఎన్సీపీని ఆహ్వానించక తప్పలేదు.

- Advertisement -