’గేట్‘.. వేసేస్తాం అంటోన్న ఏఐసీటీఈ.. ఆందోళనలో బీటెక్ విద్యార్థులు.. ఏమిటిది? ఎందుకిలా??

gate-engineering-students
- Advertisement -

engineering-students-exam-gate

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీర్స్ (గేట్)..

ఈ మాట.. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది.

ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత ఉండటం లేదు.. విద్యార్థిలో కూడా నవ్యత అంటే కొత్తదనం ఉండటం లేదు.. అలాగే ఇంజనీరింగ్ చదువుతూ ఏదో హీరోలమైపోతున్నామనుకునే వారు ఎక్కువైపోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కార్పొరేట్ విద్యలో విలువలు మృగ్యమైపోతున్నాయి. ఇలాంటి మనస్తత్వంతో ఉద్యోగానికెళ్లి అక్కడ రెక్లెస్ గా వ్యవహరించి.. బాధ్యత లేకుండా, పనిపై శ్రద్ధ లేకుండా ఉంటున్నాడనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని.. ఇంజనీరింగ్ విద్యార్థి ముకు తాడు వేయడానికి.. ఆ ఎగిరెగిరే పడేవాడిని.. కొంచెం నేలపై పెట్టాలని భావించి ఎగ్జిట్ ఎగ్జామ్‌గా ‘గేట్’ పెట్టాలని ఏఐసీటీఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి) ఆలోచన చేస్తోంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో.. అసలు ఇంజనీరింగ్ విద్య ఇలా ఎందుకు తయారైందో.. కారణాలు విశ్లేషిస్తూ.. ‘న్యూస్ ఎక్స్ ప్రెస్’ అందిస్తోన్న ప్రత్యేక కథనం.. మీకోసం…

అవి సాఫ్ట్‌వేర్ బూమ్..రోజులు…

ఇంజనీరింగ్ చదివితే చాలు.. ఎత్తుకుపోయేవాళ్లు. ఎందుకంటే వారికక్కడ ఒక మనిషి కావాలి.. ఆ స్టూడెంట్‌కి బ్యాక్ లాగ్ లు ఉన్నాయా? లేవా? అనెవరూ చూడలేదు. ఆ సమయంలో ఒక మోస్తరుగా బీటెక్ చదివిన వాళ్లు.. మంచి జీతాలు అందుకోగా.. టాపర్స్ ఏకంగా అమెరికానే వెళ్లిపోయారు.

ఇక అది వేలం వెర్రిగా మారిపోయింది. ఒకరిని చూసి ఒకరు.. వారిని చూసి మరొకరు.. ఇలా పోటీలు పడి పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలనుకొని.. లక్షలకు.. లక్షలు డొనేషన్లు కట్టి ఇతర రాష్ట్రాలకు  పంపించారు. దీంతో ఆ డబ్బులు మనకే ఎందుకు రాకూడదనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాల్లో బయలుదేరింది.

ఇలా.. ఈ పరిణామాలన్నీ గమనించిన కొన్ని రాష్ట్రాలు ముందడుగు వేశాయి.  టెక్నాలజీలో అత్యంత ముందున్న..ఆనాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ బూమ్ ని పసిగట్టారు. వెంటనే హైదరాబాద్ సిటీలో హైటెక్ సిటీ కట్టేందుకు సాఫ్ట్ వేర్ కంపెనీలకు గేట్లు బార్లా తెరిచారు. అతి తక్కువ థరలకు  స్థలాలు, కరెంటు, నీళ్లు ఇలా మౌళిక సదుపాయాలన్నీ కల్పించారు.

ఇంజనీరింగ్ కళాశాలలకు ఇబ్బడిముబ్బడిగా  అనుమతులు, ఫీజు రీయంబెర్స్ మెంట్లు

అయితే ఇంతా మనం చేసి.. మళ్లీ వేరే రాష్ట్రం వాళ్లకి ఉద్యోగాలు పోకూడదనే ఉద్దేశంతో..ఇంజనీరింగ్ కాలేజీలకి ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చి పడేశారు.ఒక ఐదెకరాల స్థలం ఉండి..బిల్డింగ్ లు  కట్టకునే స్థోమత ఉంటే చాలు..అనుమతలు వచ్చి పడిపోయాయి.

ఈ దశలో  అధికారంలోకి వచ్చిన  స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక వంద అడుగులు ముందుకేసి.. చంద్రబాబు అనుమతులే ఇచ్చాడు..మనం ఫ్రీగా చదివిద్దామని.. ఇంజనీరింగ్ చదివితే.. ఫీజు రీయంబెర్స్ మెంట్ ప్రకటించారు. అది ఒక ప్రభంజనం సృష్టించింది. వేలం వెర్రిగా విద్యార్థులు కాలేజీలపై పడ్డారు.

డిగ్రీకి ఫీజు కట్టాల్సిందే…అదే ఇంజనీరింగ్ చదివితే ఫ్రీ.. సంవత్సరానికి ఒక పదివేలు కడితే చాలు..ఇంజనీరింగ్ చదువు హ్యపీగా పూర్తయిపోయేది. మద్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వడివడిగా అవకాశాలు అందిపుచ్చుకొని.. ఆర్థిక స్వావలంబన సాధించారు.

అటు హైటెక్ సిటీ నిర్మాణం పూర్తి కావడం, ఇటు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారు రావడం..వచ్చినవాళ్లు వచ్చినట్టు హాట్ కేకుల్లా ఎగిరిపోయారు. ప్రపంచమంతా కొత్తకొత్త ఇన్నోవేషన్స్ కి నాంది పలికాయి. చాలా ఉద్యోగాలు డేటా బేస్ట్ గా వచ్చాయి. అంటే మనం ఇన్నాళ్లు వాడినవే..కంప్యూటర్ లాంగ్వేజ్ లో వాడేలా సాఫ్ట్ వేర్ రూపకల్పన అతివేగంగా జరిగిపోయేది.. ఊపిరి తీసుకోనంతగా ఆర్డర్లు వచ్చి పడేవి..

ఉదాహరణకి..

బ్యాంకింగ్ రంగాన్నే తీసుకుంటే..దానిని డిజిటలైజేషన్ లో మార్చే ప్రక్రియకు కొన్ని వందల బ్యాంకులు..కొన్ని కోట్ల రూపాయలు చెల్లించాయి. అలాగే గవర్నమెంట్ సర్వీసులు కొన్నింటిని ఆన్ లైన్ చేయాలి..మీడియాలోకి కూడా కంప్యూటర్లు వచ్చి చేరాయి. వార్తలన్నీ టైప్ చేయడం..పేజీలు డీటీపీలో పెట్టడంతో వార్తా పత్రికలకు ఒక సౌలభ్యం వచ్చింది.

ఇలా దాదాపు వ్యవస్థలన్నీ.. ఇప్పుడు మనం చూసే గూగుల్ డేటా అంతా సేకరించి..అందులో పోస్ట్ చేయడం, ఇలా సమాచార సేకరణంతా ఎక్కడికక్కడ డిజిటల్ లోకి మారే సాఫ్ట్ వేర్ రూపకల్పనల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు అలుపెరగకుండా పనిచేశారు..అంటే  ఒక్క ఇండియానే కాదు.. ప్రపంచమంతా ఇప్పుడొక డిజిటలైజ్ ఆకారానికైతే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ సాంకేతిక నిపుణుల అవసరం తగ్గింది.

80వేల ర్యాంకు వచ్చినోళ్లకి.. ఇంజనీరింగు సీటు.. చౌకబారుగా మారిన అత్యున్నత విద్యా వ్యవస్థ

అప్పట్లో వీరందరినీ చూసి..అలా వారువీరని కాకుండా.. ఎంసెట్ లో 80,000 నుంచి లక్ష ర్యాంకులు దాటిన వారికి ..ప్రైవేటు కాలేజీల్లో భారీగా ఫీజుల వసూలు చేసి సీట్లు ఇచ్చేశారు. ఇలా ఇంజనీరింగ్ చదువుని చౌకబారు చదువుగా మార్చేశారు. దీంతో దేశంలోనే అత్యున్నత విద్యా విధానానికి విలువ లేకుండా పోయింది.

మరోరకం విద్యార్థులు.. ప్రభుత్వం కడుతుంది కదాని..డిగ్రీ చదవాల్సిన శక్తి సామర్థ్యాలు ఉన్నవారు.. అటెళ్లకుండా ఇటు చేరిపోయారు. ఇలా  ఓవర్ ర్యాంకు హోల్డర్లు, డొనేషన్లు కట్టి చేరినవాళ్లు ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్లి అవి అర్థం కాక..చతికిల పడ్డారు. నాలుగేళ్లో బ్యాక్ లాగ్ లు  లాగలేక ఆగిపోయారు. ఇలాంటి నిరుద్యోగ ఇంజనీర్లు ఈ రోజున  రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 14 లక్షల మంది పైనే ఉంటారని ఒక అంచనా..

వీరి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందే తప్ప తరగడం లేదు. ఇప్పడందరికి ఉద్యోగాలు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇవ్వలేకపోతున్నాయి. ఏడాదికి ఒకలక్ష నుంచి రెండు లక్షల వరకు మాత్రమే ఉన్నాయని ఒక అధికారిక అంచనా..కానీ ప్రతి ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 3 లక్షల మంది రాస్తున్నారు. అంటే మరి మిగిలిన భారతదేశమంతా కలిపి ఎందరు రాస్తున్నారో గ్రహించండి. ఇదీ పరిస్థితి..

అసలు సాఫ్ట్ వేర్ లక్యమే..మానవ రహిత పని విధానం..

ఒకప్పుడు ఒక పనిని వంద మంది చేస్తే.. ఈరోజున ఒక కంప్యూటర్ దగ్గర కూర్చుని.. ఒక మనిషి చేసి..అందరికి మెసేజ్ లు పెట్టేస్తున్నాడు..అంటే పాతరోజుల్లో గవర్నమెంటు ఆఫీసుల్లో ఉద్యోగులను చూడండి..లెక్కకు మిక్కిలి ఉండేవారు.. ఇప్పుడు చూడండి.. హాయిగా మీ సేవలు, ఈ సేవలకిచ్చి..హ్యపీగా చేసుకుంటున్నారు. ఒకప్పుడు కరెంటాఫీసులో.. బిల్లులు కట్టించుకునే ఉద్యోగి జీతం..రూ.40 వేలపైనే ఉండేది.

అదే ఇప్పుడు ఈ సేవలో.. ఉద్యోగికి రూ.8వేలిచ్చి కరెంటు బిల్లులు కట్టించేస్తున్నారు. చూశారా..  ఈ దశలో ఉద్యోగాలు, జీతాలు ఎలా తగ్గుముఖం పడుతున్నాయో.. ఈ పరిస్థితుల్లో ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి .. చిన్న ఉద్యోగం చేయలేక అవస్థలు పడుతున్నాడు. అదే డిగ్రీ చదివి ఉంటే.. ఏదొక ఉపాధితో కాలం గడిపేసేవాడు. పెద్ద ఉద్యోగం రాదు.. చిన్నది చేయలేడు..ఈ దశలో ఆ విదార్థి భవిష్యత్తు అంధకారమయమైపోతోంది.

ఇవన్నీ చూసి ‘గేట్’..లు మూస్తేనేగానీ.. ప్రభంజనం ఆగదని భావిస్తున్న ఏఐసీటీఈ.. 2019- 20 నుంచి అమలుకు యోచన

అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)..ఒక నిర్ణయం తీసుకుందామని..ఆలోచన చేసి..అసలు అందరి ఉద్దేశం ఎలా ఉందో తెలుసుకుందామని చేస్తున్న ప్రయత్నాలు వివాదాలు సృష్టిస్తున్నాయి.  ఈ ముక్కేదో ముందే చెబితే.. చదవగలిగే వాళ్లు చేరే వారు.. లేదంటే వెనక్కి వెళ్లిపోయేవారు. అంతా చదివి లక్షల రూపాయలు ఫీజులు కట్టి  చేరిన తర్వాత.. ఇప్పుడు గేట్ అంటే ఎలా అని తల్లిదండ్రలు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

ఇక ఈ మాత్రం దానికి అక్కడ ఎంసెట్ ఎందుకు..80వేలు ర్యాంకు వచ్చేవాడికి సీటు ఇస్తున్నప్పుడు..అదేదో ఇంటర్మీడియట్ మార్కులు చూసి ఇచ్చేస్తే సరిపోయేది.. అక్కడ ఎంసెట్ రాయాలి..నాలుగేళ్ల తర్వాత ..గేట్ రాయాలి.. ముందొక గేటు.. వెనకొక గేట్. ఇన్ని గేట్లు ఎందుకు? ఏదొకటే పెట్టండి మహాశయా..అని విద్యార్థులు వేడుకుంటున్నారు.

నిజంగా గేట్ పెడితే.. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు మూసేసుకొని కూర్చోవల్సిందేనని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఎంట్రన్స్, ఎగ్జిట్.. అంటూ హార్డిల్స్ పెడితే చేరే వాళ్లు సగం మంది ఆగిపోతారని వారి ఆందోళన వారిది..

లేదంటే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కాగానే.. ఈ ఎక్జిట్ పెడితే.. ఒక సంవత్సరం విద్యా విధానం నష్టపోయి.. తన కెపాసిటికి తగినట్టుగా తిరిగి ఏ డిగ్రీలోనో చేరుతాడు. ఇప్పుడా విద్యార్థి భవిష్యత్తే.. ఆందోళనకరంగా మారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆనాడు. ఆ సమయానికనుగుణంగా కళాశాలలకు అనుమతులిచ్చారు. ఇప్పుడు మళ్లీ.. ఇంజనీరింగ్ విద్యకు విలువ లేకుండా పోతుందని నెత్తి కొట్టుకోవడమెందుకు?.. అడుసు తొక్కనేల..కాలు కడగనేల..అని కొందరు  సోషల్ మీడియలో సెటైర్లు పేల్చేస్తున్నారు.

మంచిదే..అని కొందరు, కాదని మరికొందరు…

ఢిల్లీలోని ఇక ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఇది ఒకరకంగా మంచిదే.. తెలివైన వాళ్లకి అవకాశాలు దొరుకుతాయి. అని పేర్కొన్నారు. అయితే అహ్మదాబాద్ లో ఇంజనీరింగ్ విద్యార్థి మాట్లాడుతూ నిజమే. నాకు ఎమ్మెస్ అమెరికాలో చేయాలని ఉంటుంది.  నేను గేట్ క్వాలిఫై కాలేదనుకోండి.. అప్పుడు నా పరిస్థితేమిటి? అని ప్రశ్నించాడు.

ఈ పరీక్ష పెట్టే బదులు.. అదే ఎగ్జామ్ అదే కాలేజీలో మరో రూపంలో పెడితే సరిపోయేది కదా..మళ్లీ  ఈ తేనెతుట్టను ఎందుకు కదుపుతారని మరొక ప్రొఫెసర్ ప్రశ్నించారు.  చివరికి మాత్రం ఏదో ఇంజనీరింగ్ చదువుదామని అనుకున్నవాళ్లు ఇబ్బంది పడతారని అమరావతిలోని ఒక సీనియర్ సిటిజన్ వ్యాఖ్యానించారు.

ఆలోచన మంచిదే..అన్ని గేట్లు దాటగలడా? లేదా? 2019-20లో కొత్తగా ఎంసెట్ రాయబోయే వారికి సూచించాలి..

2019-20 విద్యా సంవత్సరంలో కొత్తగా రాసేవారికి చెబితే.. ఆ విద్యార్థి, తల్లిదండ్రులు..కూర్చుని ఆలోచించుకుంటారు. మనోడు అన్ని గేట్లు దాటలేడు..అనుకుంటే ఆగిపోయి..వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటారు. లేదా శక్తి ఉంది.. ఎన్ని గేట్లయినా అవలీలగా దాటేస్తాడనుకునే వారు చదివిస్తారు..

ఇంజనీరింగ్ కళాశాలలను పెంచి పోషించడానికి, వారికే మాత్రం ఇబ్బందుల్లేకుండా కేవలం విద్యార్థుల వరకే నష్టం కలిగించే చర్యలు తీసుకుంటే.. మాత్రం విద్యార్థి సంఘాలన్నీ ఏకమై..ఉద్యమాలు చేసే పరిస్థితి వస్తుందని ఒక విద్యార్థి సంఘ నాయకుడు హెచ్చరించాడు. అయితే ఈ 14 లక్షలమంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో.. వారిక ి గేట్ తప్పనిసరి చేస్తే మాత్రం..అదింకా తీవ్రపరిణామాలకు దారి తీస్తుందని పేర్కొన్నాడు.

-శ్రీనివాస్ మిర్తిపాటి

 

 

- Advertisement -