మిగిలిన పదో తరగతి పరీక్షలు రద్దు.. మధ్యప్రదేశ్ సీఎం కీలక నిర్ణయం

2 weeks ago
remaining-tenth-exams-cancelled-in-madhya-pradesh

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పదో తరగతి పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా మిగిలిపోయిన పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాదు, ఇదివరకు నిర్వహించిన పరీక్షల ఆధారంగా పదో తరగతి మెరిట్‌ జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. అలాగే రద్దు చేసిన పరీక్షలకు సంబంధించి.. పాస్‌ రిమార్క్‌తో విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయనున్నట్టు పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో మార్చి 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం కొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత.. కరోనా లాక్‌డౌన్ కారణంగా కొన్ని పరీక్షలు అర్థంతరంగా వాయిదా పడ్డాయి.

ఇక మిగిలిపోయిన ఇంటర్‌ పరీక్షల విషయానికొస్తే మాత్రం.. జూన్‌ 8 నుంచి జూన్‌ 16 మధ్యలో వాటిని నిర్వహించాలని మధ్యప్రదేశ్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ నిర్ణయం తీసకుంది.

ప్రైవేటు పాఠశాలలు మార్చి 19 నుంచి లాక్‌డౌన్‌ ముగిసేవరకు విద్యార్థుల నుంచి కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని కూడా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆదేశించారు.