జూన్ 1 నుంచే పాఠశాలలు ప్రారంభం.. 2018-19 విద్యా సంవత్సరం కేలండర్ విడుదల

- Advertisement -

హైదరాబాద్:  2018-19 విద్యా సంవత్సరంలో పాఠశాలలు జూన్‌ 1నే ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వం బుధవారం పాఠశాల విద్యా కేలండర్‌ను ప్రకటించింది. ఈ విద్యా కేలండర్ ప్రకారం 2019 ఏప్రిల్‌ 12 పాఠశాలల చివరి పని దినం. ఏప్రిల్‌ 13 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జనవరి 10కల్లా పదో తరగతి సిలబస్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది.  ఆ తరువాత రివిజన్ చేయిస్తూ, పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను బోర్డు పరీక్షలకు సన్నద్ధం చేయాల్సి ఉంటుంది.

పాఠశాల స్థాయిలో నిర్వహించే ఫార్మేటివ్‌ అసె‌‌స్‌మెంట్ (ఎఫ్‌ఏ), సమ్మేటివ్‌ అసె‌‌స్‌మెంట్ (ఎస్‌ఏ) పరీక్షల షెడ్యూల్‌నూ ప్రకటించారు. ఎస్‌ఏ-1 పరీక్షలను 2018 అక్టోబరు 1 నుంచి 8 వరకు, ఎస్‌ఏ-2 పరీక్షలను 2019 మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహిస్తారు. కొత్త విద్యా సంవత్సరంలో పలు పండుగలకు పాఠశాలల సెలవులను నిర్ణయించారు.

- Advertisement -

అక్టోబరు 9 నుంచి 21 వరకు (13 రోజులు) దసరా సెలవులు ఉంటాయి. మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 23 నుంచి 29 వరకు క్రిస్మస్‌ సెలవులు ప్రటించారు. 2019 జనవరి 11 నుంచి 17 వరకు (ఏడు రోజులు) సంక్రాంతి సెలవులు ఉంటాయి. దసరా సెలవులను 15 నుంచి 13 రోజులకు తగ్గించి సంక్రాంతి సెలవులను మాత్రం 5 నుంచి 7 రోజులకు పెంచారు.

ఇక పాఠశాల స్థాయి, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి ఆటల పోటీలను ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నిర్వహించనున్నారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు కొనసాగుతాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల్లో మాత్రం 8:45 నుంచి 4:00 గంటల వరకు
కొనసాగుతాయి. ఇక ప్రాథమికోన్నత పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా 9:00 నుంచి 4:15 గంటల వరకు కొనసాగనుండగా.. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల్లో 8:45 నుంచి 4:00 గంటల వరకు కొనసాగుతాయి.

ప్రాథమిక పాఠశాలలు 9:00 నుంచి 4:00 గంటల వరకు కొనసాగితే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల్లో 8:45 నుంచి 3:45 గంటల వరకు కొనసాగుతాయి. ఇక ఉన్నత పాఠశాలల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలల సమయాన్నే పాటించాల్సి ఉంటుంది. 10వ తరగతికి ఉదయం 10:30 నుంచి 11:15 గంటల వరకు, తొమ్మిదో తరగతికి 11:30-12:15 గంటల వరకు, ఎనిమిదో తరగతికి మధ్యాహ్నం 1:45-2:30 గంటల వరకు, ఏడో తరగతికి 2:30-3:15 వరకు, ఆరో తరగతికి మధ్యాహ్నం 3:25-4:05 గంటల వరకు డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తారు.

పాఠశాల విద్యార్థులందరికీ తప్పనిసరిగా స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులకు వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా హెల్త్‌ కార్డులను జారీ చేయనున్నారు. ఈ మేరకు ఆయా పాఠశాలల  ప్రధానోపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఒంటిపూట బడులపై 3న నిర్ణయం…

ఈసారి జూన్‌ 2న అన్ని పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జూన్‌ 12 వరకు పాఠశాలలను ఒక్కపూటే నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. దీనిపై జూన్ 3న నిర్ణయం తీసుకునే అవకాశముంది.

- Advertisement -