టెన్త్ పరీక్షలు.. జూన్ మొదటి వారం తరువాతే, అదీ పరిస్థితి అనుకూలిస్తేనే: తేల్చేసిన హైకోర్టు

3:21 pm, Tue, 19 May 20
telangana-high-court-hearing-on-remaining-tenth-exams

హైదరాబాద్: రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉండి, సమర్థంగా కరోనా నివారణ చర్యలు తీసుకునేటట్లయితే జూన్ మొదటి వారం తరువాత మిగిలిన పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చునని తెలంగాణ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.

అయితే కరోనా నివారణ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని, ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉండాలని, భౌతిక దూరం సాధ్యం కాని కేంద్రాలను మార్చాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

చదవండి: కరోనా అప్‌డేట్: 24 గంటల్లో 4970 మందికి పాజిటివ్.. భారత్‌లో లక్ష దాటిన కరోనా కేసులు, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా…

దీనికి సంబంధించి జూన్ 3వ తేదీన సమీక్ష నిర్వహించి, నివేదికను జూన్ 4న హైకోర్టుకు సమర్పించాలని, ఒకవేళ అప్పటికి గనుక కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉంటే పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 

మంగళవారం పదో తరగతి పరీక్షలకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రంలో మార్చి 23న లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పట్లో బాలకృష్ణ అనే ఉపాధ్యాయుడు హైకోర్టును ఆశ్రయించడంతో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

చదవండి: కేంద్రం దగా.. ఆర్థిక ప్యాకేజి పెద్ద బోగస్.. ఆ ఆంక్షలేంది? అమలు ప్రసక్తే లేదు!: మండిపడ్డ సీఎం కేసీఆర్

అప్పటికి రాష్ట్రంలో కేవలం తెలుగు, హిందీ పరీక్షలు మాత్రమే జరిగాయి. ఆ తరువాత హైకోర్టు ఆదేశాలతో మిగతా పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కూడా మొదలైంది.

అయితే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్, కరోనా ఉద్ధృతిని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలో పరిస్థితి కొంత వరకు మెరుగైంది. ఈ నేపథ్యంలో మళ్లీ టెన్త్ ఎగ్జామ్స్ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది.

ఇటీవల సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ నెలలోనే టెన్త్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉండడంతో వాటిని రద్దు చేయాలంటూ ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

5.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని, కరోనా నివారణ చర్యలన్నీ తీసుకుంటామని, విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామని కోర్టుకు తెలియజేసింది.

అయితే దీనిపై పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోందని, పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం ఆడుకోరాదని పేర్కొన్నారు.

చదవండి: ఏపీ పాలిటిక్స్‌పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు.. జగన్‌కు ప్రశంసలు

దీనికి అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ.. కరోనా నివారణ చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేయడంతో.. టెన్త్ పరీక్షల అంశంపై ఉన్న మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

పరీక్షల నిర్వహణ సమయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లాక్‌డౌన్ సమయంలో నిర్వహించరాదని, ఒకవేళ కరోనా ఉద్ధృతి మరింత పెరిగితే మాత్రం పరీక్షలు వాయిదా వేయాల్సిందేనని సూచించింది.