బీజేపీ ప్రభుత్వం వేధిస్తోంది: చంద్రబాబు, 2019లో తృతీయ కూటమిదే అధికారం, ప్రధాని పదవిపై రాహుల్‌కు షాక్…

chandrababu-devegowda-kumaraswamy
- Advertisement -

ap-cm-chandrababu-in-devegowda-residence

బెంగళూరు: బీజేపీయేతర పార్టీలు అన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని దేవేగౌడలు అన్నారు. గురువారం బెంగళూరు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పద్మనాభనగర్‌లోని మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి వెళ్లారు.

చంద్రబాబును వారు సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు దేవెగౌడ, ప్రస్తుతం కర్ణాటక సీఎం కుమార స్వామిలతో సమావేశమై బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చించారు. అనంతరం వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.

కేంద్రం రాష్ట్రాలను వేధిస్తోంది…

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తాను దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిశానని చెప్పారు. కేంద్రం రాష్ట్రాలను వేధిస్తోందని, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు.

సీబీఐ, ఆర్బీఐ వంటి స్వతంత్ర సంస్థలను బీజేపీ ప్రభుత్వం హరించి వేసిందని ధ్వజమెత్తారు. కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని చాలా రాష్ట్రాలలోని ప్రతిపక్ష నేతలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రాజ్యాంగబద్ద సంస్థలను నాశనం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పడం చారిత్రక అవసరం అని వ్యాఖ్యానించారు.

మీడియా స్వేచ్ఛనూ హరించారు…

నోట్ల రద్దు జరిగి ఇప్పటికీ రెండేళ్లయిందని, ఇప్పటికీ నోట్ల రద్దు కష్టాలు తీరలేదని చంద్రబాబు అన్నారు. అంతేకాదు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేయడమేకాకుండా మీడియాను కూడా వేధిస్తోందన్నారు.

స్వేచ్ఛగా వ్యవహరించాల్సిన మీడియా ప్రస్తుతం అభద్రతా భావంలో ఉందని, బీజేపీ ప్రభుత్వం హయాంలో మీడియాభయపడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. మీడియా ఎప్పుడూ అధికార పార్టీకి కొమ్ము కాస్తుందని, కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీయేతర పార్టీలు అన్నీ ఏకం కావాలని కోరారు.

2019లో అధికారంలోకి తృతీయ కూటమి…

2019లో తృతీయ కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను మాయావతి, అఖిలేష్ యాదవ్‌లతో చర్చించానని, శుక్రవారం డీఎంకే అధినేత స్టాలిన్‌తో కూడా చర్చిస్తానని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కలిసి పని చేస్తామన్నారు. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడాలంటే దేవేగౌడ లాంటి నేత సహకారం ఎంతో అవసరమని బాబు వ్యాఖ్యానించారు.

ప్రధాని ఎవరన్నది కూడా మేం నిర్ణయిస్తాం…

వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరన్నది తాము తరువాత నిర్ణయిస్తామంటూ చంద్రబాబు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీకి కూడా ఒకింత షాక్ ఇచ్చారు.

కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే. అలాంటి కాంగ్రెస్‌తో ఒకవైపు పొత్తు పెట్టుకుని కూడా ప్రధాని అభ్యర్థి విషయానికొచ్చేసరికి చంద్రబాబునాయుడు రాహుల్‌ను లెక్కలోకి తీసుకోకపోవడం గమనిస్తే.. భవిష్యత్తులో పెద్ద ఎత్తున నాయకత్వ మార్పులు జరిగే అవకాశాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఆ పార్టీతో కలిసి పని చేస్తామని చెప్పారు.

ఎన్డీయే ప్రభుత్వం విఫలం: దేవెగౌడ

మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడుతూ… బీజేపీ వ్యతిరేక శక్తులు అన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. లౌకికవాద పార్టీలు అన్నీ ఒక్కతాటి పైకి రావాలన్నారు. గత నాలుగేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలన్నారు.

బీజేపీయేతర కూటమి కోసం కాంగ్రెస్ పార్టీ కూడా తమతో చేతులు కలుపుతుందని చెప్పారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ ప్రభుత్వం శక్తీహీనం చేస్తోందన్నారు. వచ్చే నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో మరిన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు ప్రశంసలు…

సెక్యులర్ పార్టీలను ఏకతాటి పైకి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే బాధ్యతను చంద్రబాబు తీసుకోవడం నిజంగాహర్షించదగ్గ విషయమన్నారు. అంతేకాదు, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే ఈ ప్రయత్నం సఫలం అవుతుందని భావిస్తున్నానని దేవేగౌడ చెప్పారు.

 1996 మళ్లీ రిపీట్ అవుతుంది: కుమారస్వామి

మాజీ ప్రధాని దేవేగౌడ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుల మధ్య ఎంతో కాలంగా రాజకీయ మిత్రత్వం ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు మళ్లీ ఎంట్రీ ఇచ్చారని… 1996లో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చిందని, 2019 ఎన్నికల్లో కూడా అదే మరోసారి రిపీట్ కాబోతోందని చెప్పారు.

 

- Advertisement -