నేటి రాత్రి తీరం దాటనున్న ‘బుల్ బుల్’.. భారీ వర్షాలకు అవకాశం

- Advertisement -

కోల్‌కతా: బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుపాను తీవ్రరూపం దాల్చింది. నేటి రాత్రికి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, భారీ వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాక హెచ్చరించింది.

తుపాను ప్రభావంతో కోల్‌కతా విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పశ్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులతో పరిస్ధితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు.

తుపాను తీరం దాటేటప్పుడు తీవ్రత ఎక్కువ అవుతుందని, ప్రజలు అప్రమత్తతతో ఉండాలని ఆమె హెచ్చరించారు. రక్షణ, సహాయక చర్యల్లో ప్రభుత్వాధికారులకు సహకరించాలని మమత విజ్ఞప్తి చేశారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్ఆర్‌డీఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ దళానికి చెందిన 16 బృందాలను సిధ్ధంగా ఉంచారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎప్పటి కప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.

సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ఒకటి బుల్ బుల్ తుపానులో చిక్కుకుని బోల్తా పడింది. అందులోని 8 మంది మత్స్యకారులు ఒడిశాలోని కలిభంజాదిహా ద్వీపంలో చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న ఒడిశా ఎస్‌డీఆర్ఎఫ్ బృందం , స్ధానిక మత్స్యకారులతో కలిసి వారిని రక్షించారు.

తుపాను శనివారం మధ్యాహ్నం ఒడిశాలోని పారాదీప్‌కు తూర్పు ఈశాన్యంగా 120 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీవులకు 105 కిలోమీటర్లు నైరుతి దిశలోనూ, చందబలికి 110 కిలోమీటర్ల తూర్పు-ఆగ్నేయంగా, బంగ్లాదేశ్‌లోని ఖేపుపారాకు పశ్చిమ-నైరుతిదిశగా దిశలో 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

- Advertisement -