నేడు ‘ఈస్టర్’ పర్వదినం: క్రీస్తు పునరుత్థానం.. సమస్త మానవాళికి మహోదయం…

10:58 am, Sun, 21 April 19
easter-resurrection-of-Jesus-christ

నేడు ‘ఈస్టర్’ పర్వదినం. క్రిస్మస్ తర్వాత క్రైస్తవులకు అతి ముఖ్యమైన మరో పండుగ ఇది. క్రైస్తవ మత గ్రంథాల ప్రకారం.. ఏసుక్రీస్తు శుక్రవారం నాడు శిలువ శిక్షలో ప్రాణాలు వదిలి.. సమాధి చేయబడి.. తిరిగి మూడో రోజైన ఆదివారం నాడు పునరుత్ధానం చెందుతాడు.

పునర్ అనగా తిరిగి అని, ఉత్థానం అనగా లేపబడడం అని అర్థం. అంటే.. సమాధి నుంచి ప్రభువైన ఏసుక్రీస్తు సజీవుడై లేచిన దినం అన్నమాట. అందుకే గుడ్‌ఫ్రైడే తరువాత వచ్చే ఆదివారం రోజు క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన దినం.

చదవండి: ‘గుడ్ ఫ్రైడే’ ప్రాముఖ్యత ఏమిటి? ఏసు మరణించిన రోజును ఇలా ఎందుకు పిలుస్తారు?

శనివారం రాత్రి మేల్కోనడం(జాగరణ)తో ఈస్టర్ మొదలవుతుంది. తెల్లవారుజామున ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనలో పూర్తి చీకటిలో ఈస్టర్ అగ్ని దీవెనల నడుమ ప్రభువైన ఏసుక్రీస్తు ఉత్థానానికి సంబంధించి పాత నిబంధన గ్రంథంలోని వ్యాక్యాలను చదువుకుంటారు.

ప్రార్థన సేవకు హాజరవడం, ఆదివారం మధ్యాహ్నం విందు జరుపుకోవడం చేస్తారు. ఈ విందులో పూట్‌కేక్ వంటి ఈస్టర్ బ్రేడ్‌లను, శిలువతో కూడిన వేడి రొట్టెలు వడ్డించబడతాయి.

ఈస్టర్ ఎగ్స్…

ఇక సంప్రదాయం ప్రకారం… ఈస్టర్ రోజున పెద్దవారు గుడ్లను రంగులతో అలంకరించి పిల్లలకు కనిపించకుండా వాటిని ఇంట్లోగాని, తోటలోగాని దాచి పెడతారు. ఆదివారం ఉదయం నిద్రలేచిన పిల్లలు ఈ గుడ్ల కోసం వెతుకుతారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు నిద్రలేచేసరికే వారికిష్టమైన బహుమతులను సిద్ధంగా ఉంచుతారు.

ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. ఆ ఉపవాసాలు కూడా ఈ ఆదివారం నాటి ఈస్టర్ పర్వదినంతో ముగుస్తాయి. ఈ నలభై రోజులు తాము ఉపవాసం ఉండి పొదుపు చేసిన ఆహార పదార్ధాలు, నగదును ఈస్టర్ రోజున క్రైస్తవులు భక్తిపూర్వకంగా పేదలకు దానమిస్తారు.

ఈస్టర్ రెండుసార్లు వస్తుందా?

అవును, ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగ రెండుసార్లు జరుగుతుంది. తూర్పుదేశాల క్రైస్తవులు ఒకసారి, పశ్చిమ దేశాల క్రైస్తవులు మరోసారి ఈ ఈస్టర్ పర్వదినాన్ని జరుపుకుంటారు. దీనికి కారణం ఏమిటంటే.. వీళ్లు రెండు రకాల కేలండర్లను అనుసరించడం.

తూర్పు దేశాల క్రైస్తవులు జూలియన్ కేలండర్ ప్రకారం.. పశ్చిమ దేశాల క్రైస్తవులు గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం ఈ పండుగను జరుపుకోవడం వల్ల.. ఇలా సంవత్సరానికి రెండుసార్లు ఈస్టర్ వస్తోంది. అయితే వీరు ఇరువురూ ఒకేసారి ఈస్టర్ పండుగను జరుపుకున్న సంత్సరాలు కూడా ఉన్నాయి.

చరిత్రలో ఎంతోమంది సమాధుల్లోనే…

చరిత్రలో వీరాధి వీరులు, శూరాధి శూరులు, ఒంటి చేత్తో ప్రపంచాన్ని జయించిన చక్రవర్తులు, గండపెండేరములు సంపాదించిన కవీశ్వరులు, విప్లవకారులు మరియు కళాకారులు ఎందరో. కానీ వీరందరూ చివరికి మరణం ముంగిట తలవంచారు. ఈజిప్టులో నేటికీ ఫరోల సమాధులు (పిరమిడ్లు), వాటిలో వారి మృతదేహాలు ఉన్నాయి.

సూర్యదేవుని కుమారులమని చాటించుకున్న ఫరోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బబులోను రాజైన నెబుకద్నెజరు సైతం మరణాన్ని జయించలేకపోయాడు. అలాగే అలెగ్జాండ్రియాలో ఇప్పటికీ అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ సమాధి ఉంది. రోమ్‌లో జూలియస్‌ సీజర్‌ సమాధి ఉంది.

క్రీస్తు ఎదుట మరణం తలవంచిన రోజు…

అయితే రెండువేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ఒక్కడే మరణాన్ని జయించాడు. అవును, ఆయన ముందు మరణమే తలవంచింది. అందుకే మొదటి శతాబ్దపు తత్వజ్ఞానుల్లో ఒకడైన పౌలు క్రీస్తు జీవితాన్ని సంపూర్తిగా అధ్యయనం చేసి ఇలా అంటాడు.

‘‘క్రీస్తు మృతులలో నుండి లేపబడియుండని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మేము చేయు ప్రకటన కూడా వ్యర్థమే’. ఏసుక్రీస్తు మరణాన్ని జయించటం ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదని ఋజువుచేయబడింది.

మరణం తరువాత కూడా…

క్రీస్తు పునరుత్థానం మరణం పట్ల మానవాళిలో ఉన్న భయాలను పోగొట్టింది. గత జీవితంలో చేసిన తప్పిదాల వలన, భవిషత్తులో ఏం జరుగబోతుందన్న ఆందోళన వలన, ఛిద్రమౌతున్న బంధాలను బట్టి మానవుడు విపరీతంగా కృంగిపోతున్నాడు.

అన్నిటికన్నా మనిషిని ఎక్కువగా భయపెట్టేది మరణం. కడపట నశింపచేయు శత్రువు మరణం. క్రీస్తు మరణాన్ని జయించి సజీవుడై లేవడం వలన.. మరణం తరువాత కూడా మహోన్నతమైన జీవితం ఉందని ఋజువుచేసింది.

ఇదీ ఏసుక్రీస్తు వాగ్దానం…

ఆకాశం, భూమి గతించినా దేవుని వాగ్ధానాలు ఎన్నటికీ గతించవు. తన సమాధి వద్దకు వచ్చి తొంగి చూసి అక్కడేమీ లేకపోవడంతో భయపడిన స్త్రీలకు ప్రభువు ఇచ్చిన వాగ్దానం ‘భయపడకుడి’. పునరుత్థానుడైన యేసు తనకు కనబడిన వారందరికీ ఇచ్చిన శక్తివంతమైన వాగ్ధానం కూడా ఇదే.

ఎందుకంటే.. భౌతిక ప్రపంచంలోనైనా, ఆధ్యాత్మిక జీవితంలోనైనా భయం అనేది పతనానికి దారితీస్తుంది. దేవుడు మనకు రక్షకుడుగా వెలుగుగా ఉంటాడు గనుక మనిషి మరణానికి కూడా భయపడనక్కరలేదు.

ఆయన ‘ఇమ్మానుయేలు’…

సంకల్పశక్తి, మహాబల సంపన్నత దేవుని పాదాల చెంత లభిస్తుంది. సర్వశక్తుడు మనలో ఉన్న అచేతనాన్ని తన దివ్యశక్తి ద్వారా చైతన్యపరుస్తాడు. సూక్ష్మమైన పరమాణువులలో ఉన్న శక్తి చైతన్యపరచినప్పుడే గదా అపరిమితమైన శక్తి వెలువడుతుంది.

ఇకపై వ్యాధులకు, బాధలకు, శోధనలకు, శత్రువైన సాతానుకు, భవిష్యత్తు కొరకు భయమక్కరలేదు. దేవుడు శాశ్వతకాలం తన ప్రజలతో ఉంటాడు. ఇమ్మానుయేలు అని ఆయనకు పేరుంది. దానికి అర్థం ‘దేవుడు మనకు తోడు’.

క్రీస్తు పునరుత్థానం ఏం చెబుతోందంటే…

శాస్తులు, పరిసయ్యులు, యూదా మత పెద్దలు, రోమన్లు అందరూ కలిసి ఏసుక్రీస్తును హింసించి, శిలువ శిక్షకు గురిచేసి, ఆయన్ని సమాధిలో ఉంచారు. ఆ తరువాత వారంతా ‘సత్యాన్ని సమాధి చేసేశాం’ అనుకుంటూ పండుగ చేసుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. మరణపు మెడలు వంచుతూ.. సమాధిని చీల్చుకుంటూ క్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచాడు.

దీని అర్థం ఏమిటంటే.. అబద్ధం కొంతకాలమే మనిషిని ఊరిస్తుంది. సత్యం శాశ్వతంగా నిలుస్తుంది. అంతిమ విజయం సత్యానిదే. ఏసుక్రీస్తు నేనే సత్యమని సెలవిచ్చారు. ఆయన పునరుత్థానం కూడా.. ‘సత్యాన్ని ఎవరూ శాశ్వతంగా సమాధి చేయలేరన్న విషయాన్నే నిరూపించింది..’

చదవండి: గుడ్‌ ఫ్రైడే: ఏసుక్రీస్తును ఎలా హింసించారో, శిలువపై ఆయన పలికిన మాటలు ఏమిటో తెలుసా?

చివరగా ఒక్కమాట! భవిష్యత్తుమీద భయంతో, కలవరంతో జీవిస్తున్న ప్రియ మిత్రమా! దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసం పరలోకాన్ని విడిచివచ్చి నీ స్థానాన్ని సిలువలో తీసుకొని నీకు బదులుగా మరణించాడు. దేవుడు నీకేం ఇచ్చాడని ఎవరైనా ప్రశ్నిస్తే ‘నా దేవుడు నా కోసం తన ప్రాణాన్నే ఇచ్చాడు’ అని చెప్పగలగడం ఎంత గొప్ప విషయం.

కష్టాల్లో, ఇబ్బందుల్లో ఇరుక్కొని నిరాశలో జీవిస్తున్నావా? కీడు జరుగుతుందేమోనన్న భయం నిన్ను వేదిస్తుందా? అయితే క్రీస్తు నామాన్ని స్మరించు.  ఆయన నామ స్మరణ నీకు అన్ని విషయాల్లో విజయాన్ని ప్రసాదిస్తుంది.

మరణాన్ని జయించిన క్రీస్తు సమస్త విషయాల్లో నిన్ను ఆశ్వీరదించగలడు. కీడు నీ పాదాలను తాకకముందే నిన్ను తన కౌగిట్లోకి లాక్కుంటాడు. నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానని చెప్పి నిన్ను ఊరడిస్తాడు.

అప్పుడు నీవు అంతులేని ఆనందంలో తేలియాడతావు. మహోన్నతుడైన దేవుడు నీ పట్ల కలిగియున్న ప్రణాళికలను గుర్తించి పరవశిస్తావు. నిరాశ చీకట్లు తొలగిపోయి నీ ఆధ్యాత్మిక జీవితంలో వెలుగులు విరజిమ్ముతాయి.. శుభం!