సాయిబాబా జన్మస్థలంపై వివాదం.. షిర్డీలోని సాయి ఆలయం మూత!

- Advertisement -

షిర్డీ (మహారాష్ట్ర): షిర్డీలో కొలువైన సాయిబాబా జన్మ స్థలంపై వివాదం నెలకొంది. ఆయన జన్మించింది పథ్రీలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదం మొదలైంది. పథ్రీని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు.

షిరిడీతో సమానంగా దీనిని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం నిర్ణయంపై షిర్డీలోని సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పథ్రీని కనుక అభివృద్ధి చేస్తే షిర్డీకి భక్తుల రాక తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు నేడు షిర్డీ గ్రామస్థులంతా సమావేశం కానున్నారు. అలాగే, రేపటి నుంచి ఆలయాన్ని నిరవధికంగా మూసివేయనున్నట్టు ట్రస్ట్ ప్రకటించింది.

రేపు బంద్‌కు కూడా పిలుపునిచ్చిన ట్రస్ట్.. సాయి మందిరాన్ని పర్బణికి తరలించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆరోపించింది. ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా నేటి నుంచి ఆలయాన్ని మూసివేయనున్నట్టు ప్రకటించిన సాయి సంస్థాన్ ఆలయంలోని అన్ని కార్యక్రమాలను నిలిపివేయనున్నట్టు పేర్కొంది.

పర్బణి జిల్లాలోని పథ్రీ అనే ఊరే సాయిబాబా జన్మస్థలమన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. షిరిడీకి ఇది 275 కిలోమీటర్ల దూరంలో ఉంది.

1854లో 16 ఏళ్ల వయసులో సాయి షిరిడీకి వచ్చారని, ఇక్కడే తొలుత ఓ వేపచెట్టు కింద సాయిబాబా కనిపించారని భక్తులు చెబుతుంటారు. సాయి జన్మస్థలం విషయంలో తెరపైకి వచ్చిన తాజా వివాదంతో భక్తుల్లో అయోమయం నెలకొంది.

మరోవైపు, ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే సాయి జన్మస్థల వివాదం తెరపైకి వచ్చిందని ఆరోపించింది.

ఎన్సీపీ ఎమ్మెల్యే దుర్రానీ అబ్దుల్లా ఖాన్ మాత్రం బీజేపీ ఆరోపణలను కొట్టిపడేశారు. సాయి జన్మస్థలం పాథ్రీ అని నిరూపించేందుకు తగినన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు.

- Advertisement -