ఉగాది విశిష్టత ఏమిటి? అసలెందుకు జరుపుకుంటామో తెలుసా?

5:19 pm, Tue, 2 April 19
ugadi festival

ఉగాది: ‘ఉగాది’ ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన తెలుగు పండుగ అని. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తారు.

ఉగాది‌లో ఉగ అంటే నక్షత్ర గమనం.. జన్మ, ఆయుష్షు అని అర్థం. జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనునే ఉగాది అని అంటారు. మండువేసవిలో వచ్చే ఈ పండుగ రోజున ఓ మంచి పనిచేయడం వల్ల మేలు జరుగుతుందంటారు మన పెద్దలు.

అందుచేత ఈ ఉగాది పర్వ శుభదినాన అందరూ ఉదయాన్నే నిద్రలేచి, అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్రములు ధరించి, ఇంటి గుమ్మానికి మంగళ ప్రదమైన మావిడాకులు కట్టి, ఇంటి ముంగిట రంగవల్లికలు తీర్చిదిద్దుతారు.

సంతలక్ష్మిని స్వాగతిస్తూ, షడ్రచులతో సమ్మిళతమైన ఉగాది ప్రసాదాన్ని, పంచాగానికి, సంవత్సర దేవతకు నివేదనచే తమ తమ భావి జీవితం మృదుమధురంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ, ఉగాది పచ్చడి స్వీకరిస్తూ ఉంటారు.

ఈ ఉగాది పచ్చడిని వైద్యపరంగా పరిశీలిస్తే ఇది వ్యాధినిరోధక శక్తిని ఇస్తుందని కూడా చెబుతారు. ఉగాది పచ్చడిలోని షడ్రరుచులలోని తీపి, చేదులో మానవ మనుగడలకు ప్రతీకలై నిలుస్తూ ఉంటాయని అంటుంటారు.

ఉప్పుని జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతంగాను, పులుపుని నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులకి సంకేతంగాను, వగరుని కొత్త సవాళ్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అనేదానికి సంకేతంగాను చెబుతారు.

అలాగే కారంని సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు వచ్చినప్పుడు వాటికీ ఎదురొడ్డి నిలబడాలి అని సాంకేతికంగా చెప్తారు. ఇలా షడ్రరుచులతో చేసిన ఉగాది పచ్చడిని తీసుకొవడం మంచిది అని చెప్తారు.

ఉగాది ప్రాముఖ్యత…

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి.

బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన.

అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.

ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగానూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీగానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్‌గానూ జరుపుకుంటారు.