టిక్కెట్ కోసం భక్తచరణ్ దాస్ రూ.3 కోట్లు అడిగారు.. రాహుల్ దృష్టికి వెళ్లాలనే మీడియా ముందు ఇలా.. : క్యామ మల్లేష్‌

congress leader kyama mallesh sensational comments on bhakta charan das
- Advertisement -

congress leader kyama mallesh sensational comments on bhakta charan das

హైదరాబాద్‌ : రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్‌ గురువారం రాష్ట్ర కాంగ్రెస్‌ న్యాయకత్వంపైన,  స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌ దాస్‌పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్లు అమ్ముకున్నారంటూ పార్టీ పెద్దలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, పార్టీ పెద్దల అవినీతి బాగోతానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ ఆడియో టేపులను కూడా విడుదల చేశారు.

అనంతరం క్యామ మల్లేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఇబ్రహీంపట్నం టికెట్‌ కావాలంటే 3 కోట్లు ఇవ్వాలని స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌ దాస్‌ డిమాండ్‌ చేశారని ఆరోపించారు. అలాగే టీఆర్‌ఎస్‌ నాయకుడు దానం నాగేందర్‌తో కుమ్మకై 10 కోట్లు తీసుకొని ఆయనపై బలహీన నేత దాసోజు శ్రవణ్‌ను నిలబెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టికెట్‌ కావాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలా…

‘‘ఈ నెల 2న భక్త చరణ్‌ దాస్‌ దగ్గరకు నా కుమారుడిని పంపిస్తే.. ఇబ్రహీంపట్నం టికెట్‌ కావాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని భక్తచరణ్‌ దాస్‌ కుమారుడు సాగర్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఆడియోను రాష్ట్ర నాయకులందరికి వినిపించాను. అయినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు..’’ అని క్యామ మల్లేష్ ఆరోపించారు.

ఇంకా.. ‘‘కాంగ్రెస్‌లో చాలా మంది బ్రోకర్లు చేరారు. బ్రోకర్లు అంతా కుమ్మకై అన్నదమ్ములకు, భార్యాభర్తలకు టికెట్లు ఇప్పించుకుంటున్నారు. డబ్బులు తీసుకొని కూడా నాలాంటి నిజమైన నాయకులకు అన్యాయం చేస్తున్నారు..’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దమ్ముంటే నావి అబద్దాలు అని నిరూపించండి…

అంతేకాదు, ‘‘భక్త చరణ్ దాస్‌కు, ఆయన్ని సమర్ధించే ఈ దొంగ నాయకులను సవాల్‌ చేస్తున్నా.. దమ్ముంటే ఎవరైనా నేను చెప్పేవి అబద్దాలు అని నిరూపించండి. ఇది నిజం కాకపోతే, నన్ను ఉరితీయండి. ఇలాంటి దొంగలు పార్టీ నుంచి వెళ్లిపోతేనే స్వచ్ఛమైన కాంగ్రెస్ బతుకుతుంది..’’ అని మల్లేష్ వ్యాఖ్యానించారు.

ఇలాంటి విషయాలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దృష్టికి పోకుండా జాగ్రత్త పడుతున్నారని, ఈ బ్రోకర్ల వ్యవహారం రాహుల్‌ గాంధీ దృష్టికి వెళ్లాలనే తాను మీడియా ముందు ఆడియో టేపులు విడుదల చేశానని పేర్కొన్నారు.

‘‘34 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉండి డబ్బు, ఆరోగ్యం పోగొట్టుకున్నాను. కాంగ్రెస్‌ బీసీలకు అన్యాయం చేసింది. ఇబ్రహీపట్నం కాంగ్రెస్‌ కార్తకర్తలు, నా అనుచరులతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా..’’ అని మల్లేష్‌ తెలియజేశారు.

- Advertisement -