భానుడి ఉగ్రరూపం: రెంటచింతల @ 45 డిగ్రీలు

- Advertisement -
గుంటూరు: తెలుగు రాష్ర్టాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలకు పేరొందిన రెంటచింతలలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీనికితోడు అడపాదడపా విద్యుత్‌ కోతతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ ఏడాది మార్చి నుంచే వేసవి ఎండల తీవ్రత పెరగసాగింది. ఆదివారం గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత.
గాలిలో తేమ శాతం బాగా తగ్గిపోవడంతో ఎండ తీవ్రత మరింత ఎక్కువైంది. నిత్యం వందలాది మందితో కోలాహలంగా కనిపించే రహదార్లు ఉదయం 10 గంటలకే నిర్మానుష్యమవుతున్నాయి. సూర్యుని ప్రతాపం నుంచి కాపాడుకునేందుకు జనం నానాఅగచాట్లు పడుతున్నారు. పెరిగిన కాలుష్యానికి తోడు చెట్లపెంపకంపై దృష్టి పెట్టకపోవడంతో ఎండలు అధికమవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రోళ్లు పగిలే రోహిణి కార్తెలో ఇంకెలా ఉంటుందోనన్న బెంగ పలువురిలో వ్యక్తమవుతోంది.
భానుడి ప్రచండరూపం రోజురోజుకీ ఉధృతమవుతోంది. ఎర్రటి కిరణాలతో నిప్పులు చెరుగుతున్నాడు.  ప్రజలు రకరకాల శీతల పానీయాలతో ఉపశమనం పొందుతుండగా… మూగజీవాలు తల్లడిల్లిపోతున్నాయి. ఉదయం పూట ఎండ ధాటికి తట్టుకోలేక పాదచారులు, ప్రయాణాలు చేసేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.  భానుడి ఉగ్రరూపం భూతాపాన్ని పెంచేసింది. సూర్యుని ప్రతాపానికి సగటుజీవి అల్లాడిపోతున్నాడు. చెట్టు, ఇళ్లు, నీడ, విశ్రాంతి గదుల్లో ఎక్కడ తల దాచుకున్నా ఎండ తీవ్రత నుంచి తప్పించుకోలేని పరిస్థితి.
ఒక్కసారిగా పెరిగిన ఎండలకు మలమలమాడే పరిస్థితి దాపురించింది. రాత్రివేళ వెచ్చటి ఆవిరులతో ప్రజలు నిద్రకు దూరమవుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల మీద లోడు పెరగడంతో ఏసీలు మొరాయిస్తున్నాయి. కూలర్లకు కాస్తంత డిమాండ్‌ పెరిగినా కరెంట్‌ బిల్లులు వాచిపోయేలా వస్తుండాన్ని గ్రామీణులు తట్టుకోలేకపోతున్నారు. అయితే చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉండడం కాస్తంత ఊరటనిస్తోంది.
వేసవి వడగాలుల నుంచి రక్షణ పొందడానికి రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు. కిటికీలకు గోనె సంచులను కట్టి రెండు గంటలకోసారి నీళ్లు చల్లుకుంటున్నారు. వట్టివేళ్ల తడికెలు  ఏర్పాటు చేసుకుని నీళ్లతో తడుపుతున్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే ఓజోన్‌ పొర దెబ్బతినడం, స్వార్ధం కోసం చెట్లను విచక్షణారహితంగా నరకడం ఎండలు పెరగడానికి ఓ కారణం.
ఈనెల 3న భారీ వర్షం కురిసింది. అంతే, ఆ ఒక్కరోజే.. ఆ తర్వాత మళ్లీ మామూలే. భానుడు ఎప్పటిలాగే తన ప్ర తాపం చూపుతున్నాడు. రెంటచింతల ఆర్‌ అండ్‌ బీ రహదారి వెంట ఉన్న చింత చెట్లన్నింటినీ అక్కమార్కులు నరికివేస్తున్నారు. రెంటచింతలలోని వాతావరణ నమోదు కేంద్రం 1936 నుంచి తన సేవలను అం దిస్తోంది. 2016 జనవరిలో అత్యాధునిక పరికరాలను రూ.4 లక్షలతో ఏర్పాటు చేయడం వల్ల ఉష్ణోగ్రతలు తెలుసుకోవడం మరింత సులువైంది.
- Advertisement -