రూ.10కే సంచి నిండుగా కూరగాయలు! ఓ వైసీపీ ఎమ్మెల్యే పుణ్యం.. ఎక్కడంటే…

rajanna-raitu-bazar-in-mangalagiri-1
- Advertisement -

అమరావతి: అసలే అంతంత మాత్రంగా ఉన్న దిగుబడులతో ప్రస్తుత కార్తీకమాసంలో కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కిలో వంకాయలు కనీసం రూ.40 పలుకుతున్నాయి. ఇలాంటి తరుణంలో రూ.10కే సంచి నిండుగా కూరగాయలు అంటే జనం ఎగబడరా? అక్కడా.. అదే జరిగింది. శనివారం వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ‘రాజన్న రైతు బజారు’ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

- Advertisement -

ఇంకేముంది.. రూ.10కే కూరగాయలు అని తెలియగానే జనం పోటెత్తారు. ఈ సదర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాజన్న రైతు బజారు ప్రారంభించడం వెనుక రెండు ఉద్దేశాలు ఉన్నాయని చెప్పారు. పెరిగిపోతున్న కూరగాయల ధరల నుంచి ప్రజలకు ఊరట కలిగించడం మొదటి ఉద్దేశం కాగా, రెండోది నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని మరోసారి గుర్తు చేయడానికి అని వ్యాఖ్యానించారు.

అసలు సీఎం చంద్రబాబునాయుడు ముందు రాష్ట్రంలో పాలనపై దృష్టిసారించాలని, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయి జనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో గమనించాలని కోరారు.

ముందు రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజా క్షేమాన్ని గాలికొదిలేసి.. జాతీయస్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమి ఏర్పాటు కోసం అంటూ చంద్రబాబు రాష్ట్రాలు పట్టుకుని తిరగడం ఏమిటంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. తన పాలన లోపాలను కప్పిపుచ్చుకోడానికి కేంద్రంపై నిందలు మోపుతూ చంద్రబాబు మరో నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు.

రాజన్న రైతు బజార్‌కు అనూహ్య స్పందన…

మరోవైపు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించిన ‘రాజన్న రైతు బజార్‌’కు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో కూరగాయలు పండించే స్థానిక రైతులు పేదలకు సాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. పలువురు రైతులు ఈ రైతు బజార్‌కు ఉచితంగా కూరగాయలు సరఫరా చేయడంతోపాటు తక్కువ ధరకే వాటిని అందజేస్తున్నారు.

స్థానిక మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయని, ‘రాజన్న రైతు బజార్‌’ మాత్రం ఏడు రకాల కూరగాయలు కేవలం రూ.10 లకే వస్తున్నాయంటూ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు మద్దతుగా ఉండాలనే సంకల్పంతో ఎమ్మెల్యే రాజన్న రైతు బజార్ ప్రారంభించడం సంతోషకరమని స్థానిక న్యాయవాది సీతారామి రెడ్డి వ్యాఖ్యానించారు.

- Advertisement -