ప్రభాస్‌ను ఎన్నడూ కలవలేదు.. మాట్లాడలేదు, అన్నీ పుకార్లే: వైఎస్ షర్మిల, కమిషనర్‌కు ఫిర్యాదు

10:45 pm, Mon, 14 January 19
ys-sharmila-on-prabhas-issue-1

ys-sharmila-on-prabhas-issue

హైదరాబాద్: ‘‘ప్రభాస్ అనే వ్యక్తిని నేను నా జీవితంలో ఇప్పటి వరకు కలవలేదు.. ఒక్కసారి కూడా అతడితో నేను మాట్లాడలేదు.. అతడితో నాకు సంబంధం ఉందనేది కేవలం పుకారే.. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను..’’ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై సోమవారం మధ్యాహ్నం భర్త అనిల్ కుమార్, పార్టీ నేతలు వెంటరాగా పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ను కలిసిన ఆమె.. తనపై సోషల్ మీడియాలో ఓ వర్గం దుష్ప్రచారం సాగిస్తోందని, వారిని గుర్తించి.. చర్యలు తీసుకోవాలని కోరారు.

షర్మిలకు, టాలీవుడ్ హీరో ప్రభాస్‌కు సంబంధం ఉందంటూ చాలాకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న షర్మిల నేరుగా పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల తరువాత కూడా తాను ఈ విషయమై ఫిర్యాదు చేశానంటూ ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తుండడంతో ఈ విష ప్రచారానికి వేగం పెంచారని, సందేహమేం లేదు, ఈ దుష్ప్రచారం వెనుక టీడీపీ హస్తముంది అని వ్యాఖ్యానించారు.

ఏమిటీ పైశాచిక ఆనందం..?

అంతేకాదు ‘‘పుకార్లు చూపించి వ్యక్తిత్వాన్ని చంపాలనుకోవడం దారుణం కాదా..?. నన్ను ప్రేమించే నా భర్త ఉన్నాడు.. నా మీద ఆధారపడ్డ నా పిల్లలున్నారు. నాతో పాటు మా కుటుంబం, మా శ్రేయోభిలాషులు అందర్నీ బాధపెట్టిన విషయమిది. పుకార్లు పుట్టించి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం ఎంత వరకు సబబు..? ఏమిటీ పైశాచిక ఆనందం.. ఎందుకింత నీచానికి దిగజారటం..? ఇలా పుకార్లు చేస్తున్నవారికి.. వారి వెనకున్న వాళ్లకు సిగ్గు అనిపించలేదా? ఇంత దిగజారుడుతనం అవసరమా..?’’ అంటూ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా….

“ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధముందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఆ వ్యక్తిని నా జీవితంలో నేనెప్పుడూ కలవలేదు. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధమూ లేదు. ఇది నిజం. ఇదే నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. పోనీ.. ఇలా దుష్ప్రచారం చేస్తున్నవారు ఇవన్నీ నిజమేనని ప్రమాణాలు చేసి చెప్పగలరా..?. పోనీ ఆ వ్యక్తిని కలిసినట్లుగానీ, మాట్లాడినట్లుగానీ రుజువులు, ఆధారాలు చూపించగలరా..?’’ అని షర్మిల ప్రశ్నించారు.

ys-sharmila-complaint-to-hyderabad-cpఎన్నికలు దగ్గరపడడంతో మళ్లీ మొదలుపెట్టారు…

‘‘ఐదేళ్ల క్రితమే నాపై ఈ దుష్ప్రచారం మొదలైంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టారు. ఈ విషయంపై నేను నోరు విప్పకపోతే ఇదే నిజమని ఎంతోమంది నమ్మే ప్రమాదముంది. ఈ తప్పుడు ప్రచారాన్ని మూలాలతో సహా తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఫిర్యాదు చేస్తున్నా..’’ అంటూ షర్మిల చెప్పుకొచ్చారు.

‘‘ఒక భార్యగా, తల్లిగా, చెల్లిగా నా నైతికతను, నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నా గురించి నాకు, నా దేవుడికి తెలుసు. కానీ ఈ రోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గనుక మీ అందరి ముందుకొచ్చి చెబుతున్నాను..” అంటూ వైఎస్ షర్మిల మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు.