సర్వేలన్నీ వైసీపీదే విజయం! చంద్రబాబు ప్లాన్ ఏంటి?

10:37 am, Tue, 19 March 19
All Surveys Ycp's Success, AP Latest Survey, YCP Latest survey, Newsxpressonline

అమరావతి: ప్రస్తుతం టీడీపీ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పక తప్పదు. పిలిచి మరి టిక్కెట్ ఇస్తామన్న అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. నిజానికి, లోక్‌సభ బరిలోకి దిగాల్సిన చాలామంది నేతలు, మాకు ఆ సీట్లు వద్దు బాబోయ్‌.. అంటూ చంద్రబాబు దగ్గర గగ్గోలు పెట్టారు.

ఎన్నికలన్నాక సీట్ల మార్పు, పోటీ చేసే ఉద్దేశ్యం లేకపోవడం అనేది అరుదుగానే అయినా జరిగే విషయమే. కానీ, మరీ ఇంతలాగానా.? పోటీ చేయలేమని చెప్పడమేంటి.? ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ‘ముంచేసే వ్యవహారమే’.

టీడీపీని ముంచేయనున్న అభ్యర్థులు..

పోటీకి దిగి, డబ్బు ఖర్చు చేయడం దండగేనన్న అభిప్రాయం చాలామంది అభ్యర్థుల్లో వ్యక్తమవుతుండడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని టీడీపీ సీనియర్లు ఆఫ్‌ ది రికార్డ్‌గా చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభంజనంపై సర్వేలన్నీ ఒకే మాట మీద నిలబడటంతో ఎలాగోలా బరిలో నిలిచిన నేతలకూ గుండె గుభేల్‌ మంటోంది.

ఈ పరిస్థితిని చంద్రబాబు కాస్త ముందుగానే ఊహించారో ఏమో, గట్టిగా డబ్బులున్న నేతల్ని రంగంలోకి దించారు. ఈ క్రమంలో పార్టీ కోసం పనిచేసినవారిని పక్కన పెట్టారు. బలమైన అభ్యర్థుల్నీ లైట్‌ తీసుకున్నారు.

ఏం చేసినా, టీడీపీ గ్రాఫ్‌ ఈ మధ్యకాలంలో పెరిగినట్లు ఏమాత్రం అన్పించడంలేదు. ప్రచారంలో చంద్రబాబు వెయ్యని పిల్లిమొగ్గ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆఖరికి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుని అటు తిప్పి ఇటు తిప్పి, నేరం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మీద మోపేందుకు చంద్రబాబు నానా పాట్లూ పడుతున్నారు.

‘ఆ సర్వేల్ని నమ్మొద్దు..’ అని చంద్రబాబు పైకి గట్టిగా చెబుతున్నా, పాపం అభ్యర్థుల్లో మాత్రం ధైర్యం నింపలేకపోతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ లోపు చాలా చిత్ర విచిత్రాలు జరగొచ్చంటూ టీడీపీ నేతలే మీడియాకి లీకులు పంపుతున్నారంటే.. టీడీపీ ప్రస్తుత పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.