‘చంద్రబాబు హీరో’: ఢిల్లీలో ముగిసిన దీక్ష, రాహుల్, దేవెగౌడ సహా నేతల టార్గెట్ మోడీయే…

chandrababu targets modi
- Advertisement -

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ ఢిల్లీలో సోమవారం ఉదయం ధర్మపోరాట దీక్షను చేపట్టిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాయంత్రం ముగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. న్యాయమైన కోర్కెల సాధన కోసమే తామంతా ఢిల్లీకి వచ్చామని తెలిపారు.

తన దీక్షకు ప్రధాని మోడీ అండ్‌ కో తప్ప దేశమంతా సంఘీభావం ప్రకటించిందని చంద్రబాబు చెప్పారు. దీక్షకు మద్దతు తెలిపిన అందరికీ ఐదు కోట్ల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో భారీ స్థాయిలో ధర్మపోరాటం చేయబోతున్నామని చంద్రబాబు వివరించారు. అంతేగాక, మంగళవారం రాష్ట్రపతిని కలిసి ఏపీ డిమాండ్లు తెలియజేస్తామని చంద్రబాబు తెలిపారు.

మోడీని మించిన నటుడు లేడు: చంద్రబాబు

ప్రధాని మోడీకి గౌరవం ఇచ్చినా ఆయన నిలబెట్టుకోలేదని, చేసిన తప్పును సరిదిద్దుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నానని చంద్రబాబు అన్నారు. మొత్తం 18 డిమాండ్లు నెరవేర్చాలన్నారు. మోడీని మించిన నటుడు దేశంలో మరొకరు లేరని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చినా ఏం చేశారో ఆయన చెప్పాలన్నారు. దేవెగౌడ ప్రజల మనిషి.. మోడీ మాటల మనిషని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సభ ఖర్చుల కోసం డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారని అడగడం దారుణం. గతంలో గుజరాత్‌లో ఏర్పాటు చేసిన సభలకు డబ్బు ఎక్కడిది? రఫేల్‌ వ్యవహారంలో మోడీ అనేక తప్పులు చేశారు’ అని చంద్రబాబు ఆరోపించారు.

చదవండి: వెన్నుపోటులో చంద్రబాబే సీనియర్!: ఏపీ సీంను ఏకిపారేసిన మోడీ, ‘తండ్రీకొడుకులు దిగిపోవాల్సిందే’…

‘సీబీఐ, ఈడీ, సీవీసీ, ఐటీ సంస్థలను తప్పుదోవ పట్టించారు. 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చాక మాకూ ఇవ్వాలని నిలదీశాం’ అని చంద్రబాబు తెలిపారు. ‘ఏపీ భవన్‌లో తలపెట్టిన ప్రతి కార్యక్రమం జయప్రదం అయింది. మన దీక్ష పవిత్రమైంది. అందుకే అందరూ మద్దతు తెలిపారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేకహోదా సాధించి తీరుతాం. మనోవేదనతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను క్షోభకు గురిచేయవద్దు. హక్కుల సాధనలో రాజీలేని పోరాటం చేస్తాం. ఎవరూ అధైర్య పడొద్దు.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కేంద్రంపై పోరాటానికి జగన్మోహన్ రెడ్డితోనైనా కలుస్తా: చంద్రబాబు

రాష్ట్రం, దేశం ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితోనైనా కలిసి ముందుకెళ్తామని చంద్రబాబు నాయుడు ఓ మీడియా ఛానల్‌తో అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీని కలుపుకోవడంలో తప్పేమీ లేదని చంద్రబాబు అన్నారు. కాగా, చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూూడా కలుపుకుపోతామని చెప్పడం గమనార్హం.

చంద్రబాబు హీరో అయ్యారు: దీక్షకు నేతల మద్దతు

చంద్రబాబు చేసిన ధర్మపోరాట దీక్షకు పలువురు జాతీయ నేతలు మద్దతు తెలిపారు. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌, బీజేపీ అసమ్మతి నేత శతృఘ్నసిన్హా దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శతృఘ్న సిన్హా మాట్లాడుతూ.. ఇవాళ దేశంలో చంద్రబాబు హీరో అయ్యారని కితాబిచ్చారు. కొన్ని నియమాలకు కట్టుబడే మనిషి ఆయన అని కొనియాడారు.

ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు గళమెత్తారన్నారు. వ్యక్తి కంటే పార్టీ.. పార్టీ కంటే దేశం గొప్పవని.. ఈ విషయం ప్రధాని మోడీ తెలుసుకోవాలన్నారు. మోడీ మాటలకు చంద్రబాబు దీటుగా సమాధానమిచ్చారని ఆయన చెప్పారు. చౌకీదార్‌ ఏం చేస్తున్నారో దేశ ప్రజలు తెలుసుకున్నారని ఈ సందర్భంగా శతృఘ్నసిన్హా వ్యాఖ్యానించారు.

ఏపీ దేశంలో భాగం కాదా?: మోడీపై రాహుల్ విమర్శలు

చంద్రబాబు దీక్షకు మద్దతు పలికిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడాలని రాహుల్ గాంధీ అన్నారు. ఈ ప్రధాని మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలకిచ్చిన హామీలను ఆయన విస్మరించారన్నారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా? అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని పెడచెవిన పెట్టారని దుయ్యబట్టారు. ప్రధాని ఎక్కడికి వెళితే అక్కడి పాట పాడతారని ధ్వజమెత్తారు. ఏపీకి వెళ్తే హోదా ఇవ్వకుండా అబద్ధాలు చెబుతారని విమర్శించారు. ఏపీ ప్రజలకు అండగా ఉంటామని రాహుల్ హామీ ఇచ్చారు.

చంద్రబాబుకు సహకరిస్తాం: మన్మోహన్‌

మాజీ మన్మోహన్ సింగ్ కూడా చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చింది. ప్రత్యేక హోదా హామీ కూడా పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తాం’ అని మన్మోహన్ సింగ్ అన్నారు. చంద్రబాబు దీక్షకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జాతీయ నేతలు శరద్ పవార్, ములాయం సింగ్, ఫరూక్ అబ్దుల్లా, శరద్ యాదవ్, టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్ తదితర నేతలు మద్దతు పలికారు.

నిమ్మరసం ఇచ్చి చంద్రబాబు దీక్ష విరమింపజేసిన దేవెగౌడ

చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష సోమవారం ముగిసింది. జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింపజేశారు.

చదవండి: మోడీకి కౌంటర్: ఢిల్లీలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష, మాట మార్చడంపై వామపక్షాల ఝలక్

 

- Advertisement -