కర్నూల్‌లో మరో ప్రేమోన్మాది! తన ప్రేమని ఒప్పుకోలేదని పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు!

5:02 pm, Fri, 8 February 19
kurnool city

kurnool city

రోజు రోజుకి ఈ సమాజంలో ప్రేమోన్మాదులు పెరిగిపోతున్నారు. ప్రేమించమని అమ్మాయిల వెంటపడి తిరగడం, చివరికి తన ప్రేమని అంగీకరించలేదని ఆ అమ్మాయిని హత్య చేయడం ప్రస్తుత రోజుల్లో సర్వాసాధారణమైపోయింది. ఇంట్లో చేసే గారాభం, విచ్చలవిడిగా తిరగడానికి కావాల్సినంత డబ్బు ఉండటం తో మేము ఏంచేసినా మమల్ని ఏమి చేయలేరని రెచ్చిపోతున్నారు.

గత రెండురోజుల క్రితం తెలంగాణలోని హైదరాబాద్ బర్కత్ పురలో ఒక ప్రేమోన్మాది తన ప్రేమ అంగీకరించలేదని కొబ్బరిబోండాలు నరికే కత్తితో అమ్మాయిని విచక్షణా రహితంగా నరికిన విషయం తెలిసందే. ఇప్పటికి కూడా ఆ అమ్మాయి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

రెండు రాష్ట్రాలలో జరిగిన ఈ సంఘటన మరువక ముందే కర్నూల్ లో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమని అంగీకరించలేదనే నెపంతో అమ్మాయి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

అసలు జరిగింది ఏమిటంటే ….కర్నూల్ జిల్లాలోని కౌతాలం గ్రామానికి చెందిన మొహిద్దీన్ అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను ప్రేమించాలని వేధించేవాడు. ఈ వ్యవహారం కొన్ని నెలలుగా కొనసాగుతుంది. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు తమ కుమార్తెకు దూరంగా ఉండాలని మొహిద్దీన్ ను హెచ్చరించారు. అయినా నిందితుడు తన తీరును మార్చుకోలేదు.

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం….

కాగ శుక్రవారం బాలిక ఒంటరిగా ఇంట్లో ఉండటాన్ని గమనించిన మొహిద్దీన్ లోపలకు వెళ్లి తనను ప్రేమించాలని మరోసారి డిమాండ్ చేశాడు. దీనికి యువతి ససేమీరా అనడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడే అగ్గిపెట్టె, పెట్రోల్ డబ్బా పడేసి చివరికి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. యువతి హాహాకారాలు విన్న స్థానికులు మంటలను ఆర్పి ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధితురాలి వాంగ్మూలం మేరకు పోలీస్ అధికారులు కేసు నమోదుచేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చదవండి: ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన మధులిక! పరిస్థితి అత్యంత విషమం!