వేదాద్రి మృతుల కుటుంబాలకు తెలంగాణ రూ. 2 లక్షలు, ఏపీ రూ. 5 లక్షల పరిహారం

- Advertisement -

వేదాద్రి: కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది.

నిన్న జరిగిన ప్రమాదంలో మొత్తం 12 మంది మృతి చెందగా, వారిలో 9 మంది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం, జమలాపురం గ్రామాలకు చెందినవారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందినవారు వారు ముగ్గురు ఉన్నారు.

- Advertisement -

తాము ప్రకటించిన పరిహారం ఏపీ మృతులకు కూడా వర్తిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి ఆరా తీశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రిని ఆదేశించారు.

వేదాద్రి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ప‌రిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వారికి కూడా ఈ పరిహారం అందించాలన్నారు. ప్రమాదం ఏపీ భూభాగంలో జరిగడంతో మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని జగన్ కోరారు.

- Advertisement -