షాకింగ్: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ, అసలేం జరిగింది?

9:57 pm, Mon, 4 November 19
lv-subramanyam

అమరావతి: చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఆయన్ని బాపట్ల హెచ్ఆర్డీ డైరెక్టర్‌ జనరల్‌గా నియమిస్తూ జీవో విడుదల చేసింది. కొత్త చీఫ్ సెక్రటరీ నియమితులయ్యే వరకు ఏపీ సీసీఎల్ఏ సెక్రటరీగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్‌ను రాష్ట్ర ఇన్‌ఛార్జి చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఎల్వీ సుబ్రహ్మణ్యం సడన్ ట్రాన్స్‌ఫర్‌కు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓలోనూ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తోన్న ప్రవీణ్ ప్రకాష్ ఉదంతమే కారణమని తెలుస్తోంది. ఇటీవల ప్రవీణ్ ప్రకాష్ బిజినెస్ రూల్స్‌ను మార్చడంపై చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు.

అయితే సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకే ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ బిజినెస్ రూల్స్ మార్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియని చీఫ్ సెక్రటరీ ఎల్వీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా రూల్స్ అతిక్రమించాడని ఆరోపిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయడం బెడిసికొట్టిందని చెబుతున్నారు.

ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌కు, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి మధ్య సత్సంబంధాలు కరవయ్యాయని, ప్రవీణ్ ప్రకాష్ ఉదంతంతో వీరిద్దరి మధ్య అగాధం ఏర్పడిందనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి చెందిన సీఎం జగన్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు.

సీఎస్‌‌గానే రిటైర్ అవుతారనుకుంటే…

ఇప్పటివరకు ఏపీ చీఫ్ సెక్రటరీగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ ఏడాది ఏప్రిల్ 6న ఆ పదవిలో నియమితులయ్యారు. ఎపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అప్పటి ఏపీ సీఎస్ అనిల్ పునేఠాను బదిలీ చేస్తూ.. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆ పదవిలో నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికలు ప్రశాంతంగా ముగిసి, ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్నే కొనసాగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అప్పట్నించి ఆయనే ఆ పదవిలో కొనసాగారు. అయితే రానురాను సీఎం జగన్‌కు, సీఎస్ ఎల్వీకి మధ్య విభేదాలు తలెత్తాయని, ప్రవీణ్ ప్రకాష్ ఉదంతంతో వారి మధ్య అగాధం ఏర్పడిందంటూ అందుకు ఉదాహరణగా ఎల్వీ సడన్ బదిలీగా చెప్పుకుంటున్నారు.

1983 బ్యాచ్‌కు చెందిన ఎల్వీ సుబ్రహ్మణ్యం వచ్చే ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు కేవలం 5 నెలల 26 రోజుల సర్వీసు మాత్రమే ఉంది. దీంతో ఆయన చీఫ్ సెక్రటరీగానే పదవీ విరమణ చేస్తారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉదంతంలో ఆయన బదిలీ కావడం గమనార్హం.

కొత్త చీఫ్ సెక్రటరీ రేసులో…

మరోవైపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి రేసులో నీలం సహానీ, సమీర్ శర్మ, అజయ్ సహానీల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరిని కొత్త చీఫ్ సెక్రటరీగా నియమించేందుకు జగన్ ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు సమాచారం.

నీలం సహానీ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2020 జూన్ 30న పదవీ విరమణ చేయనున్నారు. మరో ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ 1985 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఈయన ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. సమీర్ శర్మ 2021 నవంబర్ 30న రిటైర్ అవనున్నారు. మరో అధికారి అజయ్ సహానీ కూడా కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. 1984 బ్యాచ్‌కు చెందిన ఈయన 2022 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయనున్నారు.

మరి వీరిలో సీఎం వైఎస్ జగన్ ఎవరివైపు మొగ్గు చూపుతారో, ఏపీకి కొత్త చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమితులవుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

ap-go-on-lv-transfer