టీడీపీ ఎమ్మెల్యే సండ్రకు చంద్రబాబు షాక్: టీటీడీ బోర్డు నుంచి తొలగింపు, అదే కారణమా?

5:54 pm, Fri, 15 February 19
sandra-venkata-veeraiah

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు షాకిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు బోర్డు సభ్యుడిగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నియామకంను రద్దు చేశారు. ఈ మేరకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా సండ్ర నియామకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నిబంధనల ప్రకారం నెలరోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్న సండ్ర.. ఇంతవరకు బోర్డు సభ్యుడిగా బాధ్యతలు తీసుకోకపోవడంతో పాలక మండలి నుంచి ఆయనను ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనే సమాచారంతోనే తొలగింపు?

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలోనే టీటీడీ పాలకమండలిలో సండ్ర సభ్యత్వాన్ని రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉంటే, సండ్ర టీఆర్ఎస్ పార్టీలో చేరితే మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉందని ఊహాగానాలున్నాయి. సండ్ర టీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ముందస్తు సమాచారంతోనే సండ్రను టీటీడీ బోర్డు నుంచి తొలగించారా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.

చదవండి:ఏపీడీఎస్సీ మెరిట్ జాబితా విడుదల