అందుకే ఢిల్లీ వెళ్లా.. నన్ను రెచ్చగొడితే ఏమవుతుందో ఇప్పటికైనా అర్థమైందా: సీఎం చంద్రబాబు నాయుడు

cm-chandrababu
- Advertisement -

cm chandrababu

ఒంగోలు: నాలుగేళ్లుగా తాము అభివృద్ధే ధ్యేయంగా పని చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం  ప్రకాశం జిల్లా సభలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీలు గురించి అడిగితే కేంద్ర ప్రభుత్వం ఐటీ రైడ్స్‌తో భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.

- Advertisement -

ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టడానికే తాను ఇటీవల రెండుసార్లు దేశ రాజధాని న్యూఢిల్లీకి వెళ్లానని చెప్పారు. తనను రెచ్చగొడితే ఆపడం ఎవరి వల్లా కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కోడి కత్తి, రైళ్లు తగలబెట్టడం, అభివృద్ధిని అడ్డుకోవడం ప్రతిపక్షానికి అలవాటే అని ఆయన అన్నారు.

జగన్ మీద దాడి గురించి…

అక్టోబర్ 25 తేదిన ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నంలో జరిగిన కత్తి దాడిపై చంద్రబాబు స్పందించారు. జగన్ అభిమానే ఆయనపై దాడి చేస్తే తమపై ఆరోపణలు చేయడం ఏమిటన్నారు. గతంలో విశాఖపట్నానికి వచ్చి జల్లికట్టు డ్రామా చేశారని, తునిలో ఓ రైలును తగులబెట్టారని విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు అసెంబ్లీకి కూడా రాకుండా, పోరాటం చేయలేక పారిపోయారన్నారు.

వైరాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్‌తో కలిశా..

భావితరాల కోసం తాను  మూడున్నర దశాబ్దాల కాంగ్రెస్‌తో వైరాన్ని కూడా పక్కన పెట్టి ఆ పార్టీతో స్నేహానికి సిద్ధమయ్యానని చంద్రబాబు తెలిపారు. భారతీయ జనతా పార్టీని నిలదీసేందుకే తను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాహుల్‌తో సహా ఇతర పార్టీల అధ్యక్షులతో కలుస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యపు మూలస్తంభాలను నరేంద్ర మోడీ సర్కారు కూలదోస్తుందని చంద్రబాబు విమర్శించారు. జాతీయస్థాయిలో పదవులపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు. తాను ఎప్పటికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కొనసాగుతానని చెప్పారు.

బంగారుమయం చేసి అప్పగిస్తే…

హైదరాబాదును బంగారుమయం చేసి అప్పగిస్తే, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరిగ్గా పాలించుకోలేకపోతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వీలైనంత త్వరగా టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట జిల్లాలో యూనివర్సిటీకి శంకుస్థాపన చేయ్యడంతో పాటు.. దొనకొండను పారిశ్రామిక కేంద్రంగా కూడా తయారు చేస్తాం అని ఆయన హామీ ఇచ్చారు.

 

- Advertisement -