టీడీపీకి ఓటేస్తే.. వైసీపీకి పడుతోంది: ఈసీకి చంద్రబాబు లేఖ

11:35 am, Thu, 11 April 19
babu

అమరావతి: పోలింగ్ ప్రారంభమై మూడు గంటలైనా 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని ఆరోపిస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈవీఎంల పనితీరు అనుమానాస్పదంగా ఉందని, టీడీపీకి ఓటేస్తే వైసీపీకి పడుతోందని చాలాచోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయడం లేదన్న వార్తలు వస్తున్నాయని, పోలింగ్ ఆలస్యమైన చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తన లేఖపై ఈసీ సత్వరమే స్పందించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులైన టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.