31 లక్షల మంది రైతులకు భారీ షాకిచ్చిన జగన్ ప్రభుత్వం

1:25 pm, Fri, 27 September 19

అమరావతి: ఏపీలోని జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీకి మంగళం పాడింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా 4, 5 విడతల సొమ్ము విడుదలకు సంబంధించిన జీవో 38ని రద్దు చేస్తూ వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య జీవో 99 విడుదల చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని చేపట్టనున్న నేపథ్యంలో రైతు రుణమాఫీ పథకాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. 4, 5 విడతల రైతు రుణమాఫీకి సంబంధించిన సొమ్మును 10 శాతం వడ్డీతో కలుపుకుని దాదాపు 31.45 లక్షల మంది రైతులకు రూ.8,200 కోట్లు విడుదల చేస్తూ మార్చి 10న టీడీపీ ప్రభుత్వ జీవో 38 విడుదల చేసింది.

అందులో కొందరు రైతుల అకౌంట్లలో అప్పట్లో 259 కోట్ల రూపాయలు జమ చేసింది. అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో నిధుల చెల్లింపులు నిలిచిపోయాయి. అలా 31 లక్షల మంది రైతులకు రూ.7,582 కోట్లు జమ నిలిచిపోయింది.

ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రైతు రుణమాఫీని పూర్తి చేయాలని రైతు సంఘాలు, ప్రతిపక్ష నేతలు సీఎం జగన్‌ను కోరారు. కానీ టీడీపీ ప్రభుత్వ హామీని తాము అమలు చేసేదిలేదని, ఆ పథకాన్ని రద్దు చేస్తామని జగన్‌ ప్రకటించారు.

దీనిపై కొందరు హైకోర్టుకు కూడా వెళ్లారు. అయితే పథకం అమలులో ఉంటే రుణమాఫీ వర్తింపచేయాలని కోర్టు సూచించింది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా 4, 5 విడత రుణమాఫీ ప్రక్రియ ఉత్తర్వులను రద్దు చేసింది.

2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ఒక్కో రైతుకు లక్షన్నర చొప్పున రుణమాఫీ చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ 55 లక్షల రైతు కుటుంబాలకు దాదాపు రూ.24,500 కోట్లు రుణమాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగానే తొలి విడత 50 వేల లోపు ఏకమొత్తంగా మాఫీ చేశారు.

అందులో 55 లక్షల మంది రైతులకు రూ.7,565 కోట్లను మాఫీ చేశారు. ఉద్యానవన రైతులకు రూ.385 కోట్లు ఇచ్చారు. మిగిలిన రుణాన్ని మరో 4 విడతలుగా మాఫీ చేసేందుకు రైతు సాధికార సంస్థ ద్వారా రుణ ఉపశమన పత్రాలైన బాండ్లు జారీ చేశారు.

తొలివిడతలో రూ. 50 వేలు మూఫీ చేశాక 2,3 విడతల కింద 10 శాతం వడ్డీతో కలిపి రూ. ఏడు వేల కోట్లు జమచేశారు. ఇలా మూడు 3 విడతల్లో దాదాపు రూ.16,500 కోట్లు రుణమాఫీ లబ్ధి రైతులకు దక్కింది. తర్వాత నిధుల కొరత వల్ల మిగిలిన నిధుల జమ ఆలస్యమైంది.

ఎన్నికలు దగ్గరకొచ్చేయడంతో 4, 5 విడతల సొమ్ము ఒకేసారి మాఫీ చేసే ఉద్దేశంతో మార్చి 10న జీవో 38 ఇచ్చిన ప్రభుత్వం 10 శాతం వడ్డీతో కలిపి రూ.8,200 కోట్లు విడుదల చేసింది. అందులో 22 వేల మంది రైతులకు రూ.259 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఈ లోగా ఎన్నికల కోడ్‌ రావడంతో బ్యాంకర్లు జమ చేయడం నిలిపేశారు.

ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం ఏకంగా జీవోనే రద్దు చేయడంతో 31 లక్షల మంది రైతులకు రూ.7,582 కోట్లు దక్కకుండా పోయాయి. రైతు రుణమాఫీ జీవో రద్దు చేసి ‘వైఎస్సాఆర్‌ రైతు భరోసా’ అమలుకు సిద్ధమైన జగన్‌ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు.

మరో స్టిక్కర్ సీఎంగా మిగిలిపోవద్దంటూ జగన్‌కు సూచించారు. మ్యానిఫెస్టోలో రైతులకు రూ.12,500 ఇస్తామని ప్రకటించిన విషయాన్ని కన్నా గుర్తు చేశారు. కానీ రైతులకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న రూ.6 వేలను కలుపుకుని వైఎస్సార్‌ భరోసాగా కేంద్రం రైతులకు ఇచ్చేదానిపై బాబు లాగా మీరు స్టిక్కర్‌ వేయడం తప్పని చురకలంటించారు. రైతు భరోసాకు మోదీ పేరు పెట్టాలని కన్నా సూచించారు.