సంచలనం: కేంద్రానికి ఏపీ లెంపకాయ్, సీబీఐకి ఏపీలో ‘నో ఎంట్రీ’, చంద్రబాబు ప్రభుత్వం అనూహ్య నిర్ణయం!

modi-cbi-chandrababu
- Advertisement -

modi-cbi-chandrababu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఇక రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాన్ని ఎత్తివేసింది. అందుకు సంబంధించిన ‘సమ్మతి’ ఉత్తర్వును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

- Advertisement -

నిజానికి ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో తన అధికారులను వినియోగించుకునేందుకు సీబీఐకి ఇతర రాష్ట్రాల సమ్మతి అవసరం. ఆయా రాష్ట్రాలు ఈ మేరకు ‘జనరల్ కన్సెంట్’ (సాధారణ సమ్మతి) తెలిపితేనే రాష్ట్ర వ్యవహారాల్లో సీబీఐ జోక్యం చేసుకోగలదు.

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ప్రమేయం అవసరం లేదంటూ చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకోవడం పెను సంచలనం సృష్టించింది.

ఇటీవల సీబీఐ డైరెక్టర్ల నడుమ లుకలుకలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ ప్రతిష్ఠ మసకబారుతూ వస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో సీబీఐకి ఇచ్చిన ‘సమ్మతి నోటిఫికేషన్‌’ను తాజాగా ఉపసంహరించుకుంది.

ఫలితంగా సరిహద్దు దాటి ఆంధ్రప్రదే‌శ్‌లోకి అడుగుపెట్టే అవకాశాన్ని సీబీఐ కోల్పోయినట్టు అయింది. అంటే, దీని ప్రకారం.. ఇకపై ఏపీలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ, కేంద్ర రంగ ఉద్యోగులపై దాడిచేసే అవకాశం సీబీఐకి ఉండదు.

చంద్రబాబు సర్కారు అనూహ్య నిర్ణయం…

ఏపీ అనూహ్య నిర్ణయం తర్వాత ఇకపై సీబీఐ పాత్రను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పోషించే అవకాశం ఉంది. అంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖ, పోర్టులు, పోస్టాఫీసులు, సెంట్రల్‌ ఎక్సైజ్‌, టెలిఫోన్‌ కార్యాలయాలు తదితర వాటిపైనా ఏసీబీ దాడుల చేయడానికి మార్గం సుగమం అయినట్టే.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ కక్షలతో సీబీఐని ఉసిగొల్పే కేంద్రానికి ఈ చర్య గుణపాఠం కాగలదని అంటున్నారు. నిజానికి కేంద్రానికి ఇది గట్టి హెచ్చరికేనని, తమ జోలికి వస్తే ఏం జరుగుతుందో చంద్రబాబు ప్రభుత్వం స్పష్టంగా చేసి చూపించిందని వారు చెబుతున్నారు.

- Advertisement -