హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ) ముగ్గురు కొత్త న్యాయవాదులు నియమితులయ్యారు. జె.సుమతి, వడ్డిబోయన సుజాత , కిరణ్ తిరుమలశెట్టిలను ముగ్గురు న్యాయవాదులుగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టులో పనిచేస్తున్న ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు బుధవారం రాజీనామా చేయడంతో వారి స్థానంలో వీరిని నియమించారు. పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్ బాబు, షేక్ హబీబ్ తమ పదవులకు ఇటీవల రాజీనామా చేయగా, ప్రభుత్వ న్యాయ కార్యదర్శి వీరి రాజీనామాలను ఆమోదించారు.
దాదాపు ప్రతి కేసులోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఈ ముగ్గురు ఓ లేఖలో పేర్కొన్నారు.
వీరి రాజీనామాకు ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం కొత్తగా ముగ్గురిని నియమించింది. జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దాదాపు ప్రతి విషయంలోనూ సర్కార్‌కి వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల నుంచి ఇంగ్లిష్ మీడియం, నిమ్మగడ్డ వ్యవహారం వరకు దాదాపు అన్ని అంశాల్లోనూ జగన్ సర్కార్‌కి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న విషయం తెలిసిందే.