ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు

- Advertisement -

అమరావతి: ఏపీ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. కరోనా కేసులు రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది. ‘పది’ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించాలని పక్కా ప్రణాళిక చేశామని, ఆన్‌లైన్‌లో క్లాస్‌లు చెప్పించామని, పేపర్లను తగ్గించామని, పరీక్షల కోసం అందరినీ సమన్వయం చేశామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రద్దు చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక విద్యార్థుల గ్రేడింగ్ విధానాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు.

- Advertisement -

ఇదివరకే రెండుసార్లు పరీక్షలు వాయిదా పడగా, జూలైలో పరీక్షలు నిర్వహిస్తామని సురేష్ ఇటీవల వెల్లడించారు. అందులో ఎలాంటి మార్పు ఉండదని ఆయన పేర్కొన్నారు. జూలై 10 నుంచి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి.

వైరస్ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థులను దృష్టిలో పెట్టుకోవాలంటూ ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -