నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్!

7:52 am, Mon, 11 November 19
cm-ys-jagan-in-teachers-day-celebration

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రెడీ అయింది. మొత్తం 2500 పోస్టులు భర్తీ చేయనుంది.

2020 జనవరిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. అటవీ శాఖలో సిబ్బంది కొరత అధిగమించేందుకు నియామకాలు చేపడుతున్నట్టు అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

విశాఖపట్టణం కంబాలకొండలో జరిగిన ఏపీ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి బాలినేని పాల్గొన్నారు. స్మగ్లర్ వీరప్పన్ చేతిలో మృతి చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి శ్రీనివాస్‌తో పాటు పలువురు అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని తెలిపారు. జనవరి నాటికి అటవీ అధికారులకి నూతన వాహనాలు సమకూరుస్తామని చెప్పారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని…అధునాతన ఆయుధాలు సమకూరుస్తామన్నారు. ఏపీ అటవీ శాఖ దగ్గరున్న 60 టన్నుల ఎర్ర చందనం అమ్మడానికి కేంద్ర అనుమతి‌ కోరామని తెలిపారు.

ఎర్ర చందనం అక్రమ రవాణా ప్రాంతంలో సిబ్బందికి ఆధునిక ఆయుధాలు సమకూర్చామని…అటవీ ప్రాంతంలో వేగంగా కదిలే వాహనాల‌ కొనుగోలుకి ప్రభుత్వం రూ.40 కోట్లు విడుదల చేసిందని అటవీ శాఖ పిసిసిఎఫ్ ప్రతీప్ కుమార్ తెలిపారు.

అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 2500 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. రాష్ట్రంలో 33 శాతం అడవులు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసామన్నారు.