హైకోర్టులో అయ్యన్నపాత్రుడికి ఊరట.. నిర్భయ కేసులో అరెస్టుపై స్టే

ap-high-court-granted-stay-over-ayyannapatrudu-nirbhaya-case
- Advertisement -

అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసులో అరెస్టుపై స్టే ఇచ్చిన కోర్టు.. ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్యకరంగా దూషించారనే ఆరోపణలపై ఇటీవల అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. 

- Advertisement -

అయితే తనపై తప్పుడు కేసు పెట్టారని, దానిని కొట్టివేయాలని అయ్యన్నపాత్రుడు క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టును నిలుపుదల చేయాలంటూ కోర్టును అభ్యర్థించారు. 

ఈ కేసులో విచారణ జరిపిన హైకోర్టు అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

మహిళా ఎమ్మార్వోను దూషించిన కేసులో అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు, సోమవారం ఉదయం నుంచే ఆయన కోసం గాలింపు మొదలుపెట్టారు. 

అయితే ఆయన ఫోన్ సైతం స్విచాఫ్ చేసి ఉండడంతో అయ్యన్న ఎక్కడ ఉన్నారన్నది పోలీసులు పసిగట్టలేకపోయారు. మరోవైపు మున్సిపల్ మహిళా కమిషనర్‌ను దూషించిన కేసులో కూడా ఆయన్నపాత్రుడిని అరెస్టు చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

ఇటీవల డాక్టర్ సుధాకర్ కేసుతోపాటు టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారాలు చోటుచేసుకున్న సమయంలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వం తీరుపై ఒంటికాలిపై లేచి విమర్శలు గుప్పించారు.

మరోవైపు అయ్యన్నపాత్రుడిని కలిసి వచ్చిన తరువాతే డాక్టర్ సుధాకర్ కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారనే ఆరోపణలు వినిపించాయి. ‌అయితే అసలు డాక్టర్ సుధాకర్ తనను కలవనే లేదంటూ ఇప్పటికే ఆయన్న వివరణ ఇచ్చారు.

- Advertisement -