మంత్రి శ్రావణ్‌‌కు.. తోటి మంత్రుల అభినందనలు, పూర్తి సహకారం అందిస్తామని భరోసా…

- Advertisement -

AP Ministers with Minister Shravan

అమరావతి: ప్రాథమిక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిడారి శ్రావణ్ కుమార్‌ను పలువురు మంత్రులు అభినందించారు. శుక్రవారం సచివాలయంలోని ఆయన కార్యాలయానికి విచ్చేసి.. మంత్రులు చినరాజప్ప, నారా లోకేష్, భూమా అఖిల ప్రియ, ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ మరియు వైద్య ఆరోగ్య ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య కలిసి అభినందనలు తెలిపారు.

- Advertisement -

కిడారి శ్రావణ్ కొత్తగా బాద్యతలు స్వీకరించిన సందర్బంగా.. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ చైనా పర్యటన ముందు అసెంబ్లీ సమావేశాల సమయంలో దివంగత కిడారి సర్వేశ్వరరావుతో  నియోజకవర్గం అభివృద్ది పనులపై మాట్లాడుతూ కలిసి భోజనం చేశానని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్.. శ్రావణ్ కుటుంబ సభ్యుల బాగోగులు గురించి కూడా శ్రావణ్‌ను అడిగి తెలుసుకున్నారు.

శాఖ పరంగా, నియోజకవర్గ అభివృద్దికి సహకారం కావాలని శ్రావణ్ కుమార్ కోరగా మంత్రులందరి సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

మలేరియా నిర్మూలనకు ప్రజల్లో అవగాహన…

వైద్య ఆరోగ్య శాఖ, పంచాయితీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయడం వలన రాష్ట్రంలో మలేరియా జ్వరాలు తగ్గుముఖం పట్టినట్లు లోకేష్ పేర్కొన్నారు.  మలేరియా జ్వరాల అధ్యయనానికి పూనం మాలకొండయ్య అధ్యక్షతన ఒక కమిటీ శ్రీలంకలో పర్యటించడం జరిగిందన్నారు. జ్వరాలు తగ్గుముఖం పట్టాలంటే ప్రజలల్లో మార్పు తీసుకురావాలని, వారిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

నీటిని నిల్వ ఉంచకూడదని  వాటర్ ట్యాంకులను, మురిగునీటి కాల్వలను శుభ్రంగా ఉంచాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు . రాబోయే 45రోజుల్లో పంచాయితీ రాజ్  శాఖలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తిచేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ వ్యాఖ్యనించారు.

ప్రత్యేక ముఖ్య కార్యదర్శి  పూనం మాలకొండయ్య.. వైద్య ఆరోగ్యశాఖలో అమలవుతున్న పథకాలు, గత నాలుగున్నర ఏళ్లల్లో శాఖలో జరిగిన అభివృద్ధి గురించి మంత్రులకు వివరించారు.

అమరావతిలో లీలావతి ఆసుపత్రి, ఇంకా…

అమరావతిలో ముంబై కి చెందిన ప్రఖ్యాత లీలావతి ఆసుపత్రిని త్వరలో  ప్రారంభించనునట్లు లోకేష్.. మంత్రి శ్రావణ్‌కు తెలియజేశారు. త్వరలో మరో 5 ప్రముఖ ఆసుపత్రులు కూడా అమరావతి రాజధానికి తరలి రానున్నట్లు చెప్పారు.  అరకు ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంబించాలని శ్రావణ్ కుమార్ కోరగా డీపీఆర్‌లు సిద్దం చేశామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని లోకేష్‌ తెలిపారు. నిమ్మకూరును యూజీడి కింద రాష్ట్రంలోని ఒక మోడల్‌గా అభివృద్ది చేశామన్నారు.

అరకులో మరింత పర్యాటకాభివృద్ధి…

అరకు ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ మరింత అభివృద్ది చేయాలని మంత్రి శ్రావణ్ కుమార్ పర్యటక శాఖ మంత్రి అఖిల ప్రియను కోరగా.. ఎవరైనా ముందుకొస్తే పీపీపీ పద్దతిలో పర్యాటక కేంద్రంగా అరకును ఇంకా అభివృద్ది చేస్తామని ఆమె చెప్పారు.

- Advertisement -