ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై చంద్రబాబు ఏమన్నాడో చూడండి..!

6:50 am, Wed, 24 April 19
babu

అమరావతి: తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి. బోర్డు తప్పిదాల కారణంగా పరీక్షలు బాగా రాసినప్పటికీ తాము ఫెయిలయ్యామని విద్యార్థులు వాపోతున్నారు. తెలంగాణ సర్కారును బోర్డు అవకతవకలు, విద్యార్థుల బలవన్మరణాల అంశం కుదిపేస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించారు. తెలంగాణలో 17 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెలువడుతున్న వార్తలు బాధించాయన్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థుల మరణం కలిచివేసిందన్న చంద్రబాబు.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కేవలం పరీక్షలు, పాస్ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే.. కానీ పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యమని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. పరీక్షల కంటే ప్రాణాలు అమూల్యమైనవన్న బాబు.. పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలను అర్థాంతరంగా ముగించి, మీ కన్నవారు మీపై పెట్టుకున్న ఆశలను కడతేర్చకండి. ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టకండని హితబోధ చేశారు.

‘మీ ముందు ఎంతో అందమైన బంగారు భవిష్యత్తు ఉంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే.. చదువు అనేది కేవలం విజ్ఞానానికే, అదే జీవితం కాదు. ఓటమి విజయానికి తొలిమెట్టు.

మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాలలో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే, బంగారు భవిష్యత్తు మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు, దేశానికి మీరిచ్చే బహుమతి’ అని చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు సందేశమిచ్చారు.

మార్కులను వెల్లడించడంలో ఇంటర్ బోర్డు తప్పిదాలు చేసిందని, బోర్డు వైఫల్యాల వల్లే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్న తరుణంలో.. చంద్రబాబు ఇంటర్ బోర్డు వైఫల్యాల అంశాన్ని ప్రస్తావించక పోవడం గమనార్హం.