బాలకృష్ణ ఆగ్రహం ఎంత పనిచేసింది! వైసీపీలోకి టీడీపీ కార్యకర్త…

4:38 pm, Sat, 30 March 19
Balakrishna Latest News, TDP Latest News, AP Latest news, Newsxpressonline

అనంతపురం: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం ఓ టీడీపీ కార్యకర్తను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేసింది. ఇటీవలే ఓ మీడియా జర్నలిస్టును అభ్యంతరకర పదజాలంతో దూషించి ఆ తర్వాత క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా, సొంత పార్టీ కార్యకర్తపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హిందూపురం సమీపంలోని సిరివరం గ్రామానికి వెళ్లిన బాలయ్యను.. అదే గ్రామానికి చెందిన రవికుమార్ అనే టీడీపీ కార్యకర్త తమ గ్రామ చెరువుకు నీరు విడుదల చేయాలని కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన బాలకృష్ణ.. రవికుమార్‌ను తోసేశారు. బయటకు పంపించాలని పోలీసులను ఆదేశించగా.. వారు అతడ్ని అక్కడ్నుంచి పంపేశారు.

టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి..

ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన రవికుమార్.. వెంటనే టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం సమీప గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్బాల్ సమక్షంలో వైసీపీలో చేరారు.

కొంతకాలంగా తన అభిమానులు, టీడీపీ కార్యకర్తలపై చేయి చేసుకోవడం, మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో బాలకృష్ణపై కొందరు సొంత పార్టీ కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభిమాన నటుడు, నేత ఇలా చేయడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.