15 ఏళ్ల బ్రేక్ తర్వాత.. మళ్లీ సైకిలెక్కిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే పార్థసారథిరెడ్డి

11:19 am, Sun, 31 March 19

కర్నూలు: దాదాపు 15 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో శనివారం సమావేశమైన ఆయన తిరిగి పార్టీలో క్రియాశీలకంగా మెలగాలని నిర్ణయించుకున్నారు.

జిల్లాలోని అవుకు మండలం చెన్నంపల్లెకు చెందిన పార్థసారథిరెడ్డి 1999లో పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌ రెడ్డిపై విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన ఆయన కాటసాని చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు పార్థసారథిరెడ్డి దూరమయ్యారు.

నాటి నుంచి రాజకీయాలకు దూరమైన ఆయన వ్యాపారాలు చూసుకుంటూ వస్తున్నారు. అయితే, ఇటీవల మళ్లీ ఆయన దృష్టి రాజకీయాలపైకి మళ్లింది. గత ఎన్నికల్లో పాణ్యం టీడీపీ అభ్యరథి బీసీ జనార్దన్‌రెడ్డికి పరోక్షంగా సహకరించారు. ఇటీవల కొందరు టీడీపీ నేతల పార్థసారథిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.

దీనికి సరేనన్న ఆయన శనివారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. నేడు అధికారికంగా ఆయన టీడీపీలో చేరనున్నారు. ఆయనకు పట్టున్న బనగాపల్లె, పాణ్యం, డోన్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని సీఎం సూచించారు. బిజ్జం చేరికతో కర్నూలు జిల్లాలో టీడీపీ విజయావకాశాలు మెరుగుపడతాయని కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.