అమరావతికి బీజేపీ కూడా సై.. నేతల ఏకగ్రీవ తీర్మానం!

7:39 am, Sun, 12 January 20

అమరావతి: ఏపీ రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించింది. అమరావతి రైతులకు అండగా నిలబడాలని తీర్మానించింది. ‘మూడు రాజధానులు’ తమకు సమ్మతం కాదని స్పష్టం చేసింది. సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం కావాలని నిర్ణయించింది. బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో గుంటూరులో నిన్న ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ సునీల్‌ దేవధర్‌, మహిళా మోర్చా జాతీయ నాయకురాలు పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అమరావతిపై పార్టీ నేతలు తలోరకంగా మాట్లాడకూడదనే అంశంపై సమావేశంలో చర్చించారు. రాజ్‌భవన్‌, సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం, అసెంబ్లీ, సీడ్‌ క్యాపిటల్‌ వంటివి అమరాతిలోనే ఉండాలని తీర్మానించారు. రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ కన్నా చేస్తున్న ప్రకటనే పార్టీ విధానంగా ఉండాలని సుజనా సూచించారు. దీనికి సీఎం రమేశ్‌, పురందేశ్వరి తదితరులు మద్దతు పలికారు.

అయితే ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ. ఈ విషయంలో తటస్థంగా ఉండాలన్న జీవీఎల్ వ్యాఖ్యలతో విభేదించారు. ప్రజాభిప్రాయం అమరావతే రాజధానిగా కొనసాగాలని ఉందని, రాజధాని మార్పు అవివేకమైన నిర్ణయమని అన్నారు. ప్రజలవైపు ఉంటే బీజేపీ కూడా బలోపేతం అవుతుందన్నారు. సీఎం రమేశ్‌, పురందేశ్వరి ఈ వాదనను బలపరిచారు. గతంలో వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా పదేళ్లు కాదు పదిహేనేళ్లు అన్నందుకు బీజేపీ టార్గెట్‌ అయ్యిందని, మరోసారి అలాంటి ఉచ్చులోకి పడకూడదని జీవీఎల్‌ అన్నట్లు సమాచారం

అమరావతిపై రెండు జిల్లాల్లో తప్ప ఎక్కడా ఆందోళన లేదని సోము వీర్రాజు అనడంతో రాయలసీమలో ఆందోళన వ్యక్తమవుతోందని ఒక నాయకుడు అక్కడి పత్రికల క్లిప్పింగ్స్‌ చూపించారు. పురందేశ్వరి మాట్లాడుతూ టీడీపీ హయాంలో కూడా అమరావతికి సరైన న్యాయం జరగలేదని, ఇప్పుడున్న అనిశ్చితిని తొలగించేలా బీజేపీ చొరవ తీసుకోవడమే సబబని అన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించి అధిష్ఠానానికి పంపించారు.