గోదావరిలో పడవ ప్రమాదం.. మహిళ మృతదేహం లభ్యం

boat-incident
- Advertisement -

boat-incidentతూర్పుగోదావరి:  గోదావరి నదిలో పడవ బోల్తాపడిన ఘటనలో గల్లంతైన వారిలో ఒక మహిళ మృతదేహం అదివారం లభ్యమైంది.   ఐ.పోలవరం మండలం కొమరగిరి పుష్కరాల రేవులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మ‌ృతదేహం కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన గెల్ల నాగమణి(38)దిగా గుర్తించారు.

నాగమణి మృతదేహాన్ని యానాం బేస్ క్యాంప్‌కు తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంలో గల్లంతైన మిగిలిన ఆరుగురు విద్యార్థినులు పోలిశెట్టి అనూష, పోలిశెట్టి మనీష, తిరుకోటి ప్రియ, సుంకర శ్రీజ, పి.సుచిత్ర, కొండేటి రమ్య కోసం అధికారులు గాలింపును తీవ్రతరం చేశారు.

- Advertisement -
ఐ.పోలవరం మండలం పశువుల్లంక నుంచి సలాదివారిపాలెంకు గోదావరి నదిపై పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన విద్యార్థినులంతా పశువుల్లంకలోని పాఠశాలలో చదువుతున్నారు. వీరంతా శేరిలంక, కమిని, సలాదివారిపాలెం, వలసలతిప్ప, సీతారాంపురం గ్రామాలకు చెందినవారు.

గాలింపు చర్యలను పరిశీలించిన మంత్రి…

మరోవైపు యానాంలో జరుగుతోన్న గాలింపు చర్యలను మంత్రి యనమల రామకృష్ణుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడవ బోల్తా ఘటన దురదృష్టకరమన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో నేవీ హెలీకాప్టర్‌తో సెర్చ్ ఆపరేషన్ జరపడంలేదని చెప్పారు. యానాం ఎదుర్లంక వారధి పిల్లర్లపై హై ఫోకస్ లైట్లు ఏర్పాటు చేశామని, రాత్రి కూడా గాలింపు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మరోవైపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. గల్లంతైన వారిలో పెద్ద వారికి రూ.5 లక్షలు, పిల్లలకు రూ.3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.

హెలికాప్టర్‌తో సెర్చ్‌ చేసినా…

యానాం బీచ్‌ నుంచి కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్‌ గున్ని గాలింపు చర్యలను  పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఏకధాటిగా వర్షం కురుస్తున్నా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆదివారం నాడు 45 నిమిషాలు మినహా రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. గల్లంతైన విద్యార్థినుల కోసం హెలికాప్టర్‌తో సెర్చ్‌ చేసినా స్పష్టత రావడం లేదని కలెక్టర్‌ చెప్పారు. రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగిస్తామన్నారు. మూడు డ్రోన్లు కూడా వినియోగిస్తామని తెలిపారు. రేపు కూడా ఆపరేషన్‌ కొనసాగుతుందని తెలియజేశారు.

- Advertisement -