బొత్స సత్యానారాయణకి కాలం కలిసొస్తుందా!

10:47 am, Fri, 5 April 19
Bosta Satyanarayana Latest News, AP Latest Political News, Newsxpressonline

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి పిక్స్ కి చేరింది. ఈ ఎన్నికలని అన్ని ప్రధాన పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ ఎలాగైనా మరోసారి అధికారాన్ని చేపట్టాలని వ్యూహ రచన చేస్తుంటే , గత ఎన్నికలలో ఎదురైన పరాభవాన్ని వచ్చే ఎన్నికల్లో గెలిచి పరువు నిలుపుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది.

ఇకపోతే పార్టీ అధినేతలతో పాటుగా కీలక నేతలకి కూడా ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఒకప్పుడు తమ కనుసన్నలలో జిల్లా రాజకీయాలని సైతం శాసించిన నేతలు , రాష్ట్ర విభజన తరువాత అడ్రస్ లేకుండా పోయారు. ఆ తరువాత ఆ పరాభవం నుండి కోలుకొని వచ్చే ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తున్నారు. అలాంటివారిలో వైసీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి  బొత్స సత్యానారాయణ ఒకరు.

బొత్స సత్యానారాయణ, అలియాస్ సత్తిబాబు విజయనగరం జిల్లాలో పరిచయం అవసరం లేని పేరు. కాంగ్రెస్ పార్టీలో పెన్మెత్స సాంబశివరాజు అనుయాయుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన బొత్స సత్యనారాయణ, తొలుత బొబ్బిలి నుంచి ఎంపీగా, అనంతరం చీపురుపల్లి ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచారు, కీలకమైన కాపు సామాజికవర్గ నేతగా కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగిన బొత్స సత్యానారాయణ, 2004లో అప్పటి వైఎస్ కేబినెట్ లో భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.

తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం ప్రారంభించాక, భార్య బొత్స ఝాన‌్సీని విజయనగరం ఎంపీగా కూడా గెలిపించుకున్నారు. మంత్రిగా ఉంటూ ఫోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమను రాష్ట్రానికి తెచ్చే విషయంలో ప్రభుత్వం తరఫున చెల్లించిన అడ్వాన్సులు తిరిగి రాకపోవడంతో బొత్సపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

వీటిపై అప్పటి సీఎం వైఎస్సార్ సీబీఐ విచారణ జరిపించి క్లీన్ చిట్ ఇప్పించడంతో బొత్స ఊపిరి పీల్చుకున్నారు. ఆరోపణల నేపథ్యంలో బొత్స భారీ పరిశ్రమల శాఖను వదులుకుని రవాణా, పంచాయతీరాజ్, మార్కెటింగ్ శాఖలకు మంత్రిగా పనిచేశారు.

ఆపై 2009లో వైఎస్ మరణం తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం బొత్సకు బాధ్యతలు అప్పగించింది. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో పనిచేసిన బొత్స,  రాష్ట్ర విభజనకు మద్దతు తెలిపి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

సొంత జిల్లాలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం నడిపిన ఆందోళనకారులపై దాడులు చేయడం ద్వారా ప్రజల్లో బొత్సపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరికి ఇవన్నీ కలిసి 2014లో దశాబ్దానికి పైగా రాజకీయ అనుభవమున్న బొత్స కళావెంకట్రావు వదిన మృణాళిని చేతిలో ఓటమిపాలయ్యారు.

2015లో వైఎస్సార్సీపీలో చేరిన బొత్స, గతంలో తాను పనిచేసిన రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ తో పనిచేసేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉంటూ మ్యానిఫెస్టో సహా పలు కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా వ్యవహరిస్తున్న బొత్స సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో మరోసారి చీపురుపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ గెలిస్తే కీలక మంత్రి పదవితో పాటు పార్టీలో ప్రాధాన్యం పెరికే అవకాశం ఉండటంతో బొత్స పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.

చదవండి:  పవన్ పై జగన్ లాస్ట్ పంచ్! అయోమయం లో పవన్!