జగన్‌ ఓవరాక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్: బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు, విజయసాయి రెడ్డిపైనా…

9:25 pm, Tue, 2 July 19
ys-jagan-buddha-venkanna-vijayasai-reddy

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓవర్ యాక్షన్‌కి బ్రాండ్ అంబాసిడర్ అంటూ అభివర్ణించారు. మీ మహామేత తనయుడు జూనియర్ మేత.. ఓదార్పు పేరుతో ఓవర్ యాక్షన్ చేశారంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డిపై కూడా బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తన ట్విట్టర్ వేదికగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. నాన్నారు కోసం చనిపోయారంటూ చాంతాడంత లిస్ట్ మీ సలహాతోనేగా విడుదల చేశారు అంటూ దుయ్యబట్టారు.

వాళ్ళు నాన్నారు కోసం కాదా?

ఓదార్పు సహాయం కొంతమందికే ఇచ్చి.. 2014 ఓటమి తరువాత మిగిలిన వాళ్లకి ఎందుకు ఎగ్గొట్టారు? వాళ్ళు నాన్నారు కోసం చనిపోయినవారు కాదా? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అంతేకాదు, తన ట్వీట్‌లో విజయసాయిరెడ్డిని ఆయన ‘అక్రమసాయిరెడ్డి’ అంటూ సంబోధించారు. ‘‘అక్రమ సాయి రెడ్డి గారూ.. పెయిడ్ ఆర్టిస్ట్ కి పర్యాయపదం అయిన మీరు, రాజధాని రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అని అవమాన పరిచినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

దొంగలేక్కలు రాయడంలో మీరు సిద్ధహస్తులేగా అంటూ విజయసాయి రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవకాశం దొరకాలేగానీ మీరు ఎక్కడైనా దొంగలెక్కలు రాయగల సిద్ధహస్తులు అంటూ విరుచుకుపడ్డారు.

అంతేకాదు, అందుకే కదా 16 నెలల శ్రీ కృష్ణ జన్మస్థాన ప్రాప్తి అయ్యిందంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. కిన్లే వాటర్ బాటిల్‌తో ప్రజలను ఏమార్చి, దొడ్డిదారిన జీవోలతో ప్రజాధనాన్ని బొక్కడమే కదా మీ ప్రత్యేకత అంటూ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు.