సొంత గూటికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి: శ్రీశైలం నుంచి పోటీ..?

5:35 pm, Tue, 19 March 19
TDP Latest Update News, Byreddy Rajasekhar Reddy to join TDP, Newsxpressonline

కర్నూలు: సీనియర్ రాజకీయ నేత బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిక ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆయన త్వరలో సొంతగూటికి చేరుకోనున్నారు. గతంలో టీడీపీలో ఉన్న ఆయన రాష్ట్ర విభజనకు ముందు ఆ పార్టీని వీడారు.

అనంతరం రాయలసీమ హక్కుల కోసం కొంత కాలం పోరాడారు. ఈ క్రమంలో రాయలసీమ హక్కుల ఓ పార్టీని కూడా నెలకొల్పారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన టీడీపీ అధిష్ఠానంతో మంతనాలు జరుపుతున్నారు.

కాగా, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు సోమవారం ప్రకటించారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బైరెడ్డి టీడీపీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది.

తాను ఆ స్థానం నుంచి బరిలోకి దిగితే అటు అసెంబ్లీ స్థానంలో గెలవడంతో పాటు.. ఇటు టీడీపీపా లోక్‌సభ అభ్యర్థి గెలుపునకు కూడా లాభిస్తుందని చెప్పినట్లు సమాచారం. దీనిపై టీడీపీ అధిష్ఠానం నిర్ణయం వెలువడాల్సి ఉంది. టీడీపీ అధిష్టానం సానుకూలంగా స్పందిస్తే రెండు మూడు రోజుల్లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉంది.