వశిష్ట బోటు నిర్వాహకుడు కోడిగుడ్ల వెంకటరమణపై కేసు నమోదు

7:28 am, Mon, 16 September 19

దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు దుర్ఘటనపై జగన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా బోటు నడిపి ప్రమాదానికి కారణమైన ప్రైవేటు టూరిజానికి చెందిన రాయల్ వశిష్ట పున్నమి బోటు నిర్వాహకుడు కోడిగుడ్ల వెంకటరమణపై దేవీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది.

దేవీపట్నం తహశీల్దార్ మహబూబ్ అలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిబంధనల ప్రకారం బోటులో 60 మంది పర్యాటకులు, ఐదుగురు సిబ్బంది ప్రయాణించాల్సి ఉండగా, నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా 71 మందితో బోటు బయలుదేరింది.

బోటు తనిఖీ జరిగే దేవీపట్నం పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే పర్యాటకు అందరూ లైఫ్ జాకెట్లు ధరించి ఉన్నారని, స్టేషన్ దాటగానే వాటిని తొలగించారని తెలుస్తోంది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.