చంద్రబాబు అరెస్ట్.. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత

10:54 am, Thu, 9 January 20

అమరావతి: అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి.. అందరికోసం అమరావతి.. నినాదంతో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ చేపట్టిన బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమరావతి తరలింపును నిరసిస్తూ పాదయాత్రకు కదిలిన టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు, జేఏసీ ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న (బుధవారం) రాత్రి జరిగిన ఈ పరిణామాలతో విజయవాడలో హైటెన్షన్‌ రాజ్యమేలింది.

అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ప్రధాన కార్యాలయాన్ని బెజవాడలోని బెంజ్‌ సర్కిల్‌లో నిన్న చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో 25 పార్లమెంటు నియోజకవర్గాలకు తలపెట్టిన బస్సు యాత్రను ప్రారంభం కావాల్సి ఉండగా పోలీసులు రంగంలోకి దిగారు. యాత్ర చేయడానికి వీల్లేదని అడ్డుకున్నారు. యాత్రకు అనుమతులున్నాయని జేఏసీ నేతలు చెప్పినా వారు వినిపించుకోలేదు. రూట్‌ప్లాన్‌కు పర్మిషన్‌ లేదని కొత్త కారణం చూపించి యాత్ర కోసం సిద్ధం చేసిన బస్సులను ఏపీఐఐసీ కాలనీ వద్ద సీజ్‌ చేశారు.

బాబు చెప్పినా వినిపించుకోని పోలీసులు

బస్సులను సీజ్ చేయడంతో బెంజి సర్కిల్‌ నుంచి బస్సులు ఉన్న ప్రాంతానికి పాదయాత్రగా వెళ్లాలని చంద్రబాబు, ఇతర నేతలు నిర్ణయించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసుల పెద్ద ఎత్తున మోహరించారు. రాత్రి 7:30 గంటల సమయంలో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తాము ప్రశాంతంగా పాదయాత్ర చేస్తూ బస్సులున్న ప్రాంతానికి వెళ్తామని చంద్రబాబు చెప్పినా వినిపించుకోలేదు. అయితే, సీజ్‌ చేసిన బస్సులను ఇక్కడికి తీసుకువస్తే పాదయాత్ర ఆపేస్తామని చంద్రబాబు చెప్పినా కుదరదని పోలీసులు తెగేసి చెప్పారు.

ఘటనా స్థలానికి లోకేశ్, కార్యకర్తలు

దీంతో పాదయాత్రకు అనుమతి లేకుంటే ఇక్కడే కూర్చుని నిరసన తెలుపుతామంటూ చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎంపీ కేశినేని నాని, అమరాతి జేఏసీ నేతలు వేదిక ఫంక్షన్‌ హాలు వద్దే రోడ్డుపై బైఠాయించారు.అరగంటకుపైగా అక్కడే కూర్చున్నారు. విషయం తెలిసిన లోకేశ్‌, టీడీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

అరగంటపాటు పోలీసుల వ్యానులో చంద్రబాబు

ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో చంద్రబాబు సహా నేతలందరినీ పోలీసులు అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించడంతో బలప్రయోగం చేశారు. బలవంతంగా చంద్రబాబు, ఇతర నేతలను వ్యాన్లలోకి ఎక్కించారు. కొందరు వ్యానుకు అడ్డంగా పడుకుని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో పోలీసు వ్యాను తాళాన్ని కొంతమంది లాగేశారు. దీంతో సుమారు అరగంటకుపైగా చంద్రబాబు, ఇతర నేతలు వ్యానులోనే ఉండిపోయారు.

రాత్రి 9.30 గంటల సమయంలో డూప్లికేట్‌ తాళం సాయంతో వ్యాన్‌ స్టార్ట్‌ చేసిన పోలీసులు చంద్రబాబుతోపాటు అందరినీ కరకట్టపై ఉన్న ఆయన నివాసానికి తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సీపీఐ నేత రామకృష్ణ, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, టీడీపీ నేతలు దేవినేని ఉమ, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ జెడ్పీ చైర్మన్‌ గద్దె అనురాధ, అమరాతి జేఏసీ నేతలు ఉన్నారు.