ఇది పోలీసుల కిడ్నాప్, ప్రభుత్వం కక్షసాధింపు చర్య: అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై చంద్రబాబు ఫైర్…

chandrababu fires on ys jagan and police over atchannaidu arrest issue
- Advertisement -

అమరావతి: మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత కింజరావు అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

పోలీసులే అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని, ఆయన పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

- Advertisement -

బడుగు బలహీన వర్గాలను మోసగిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. 

గురువారం అర్థరాత్రి ప్రాంతంలో దాదాపు 100 మంది పోలీసులు అచ్చెన్నాయుడి నివాసంపై దాడి చేసి, ఆయన్ని కిడ్నాప్ చేశారని ఆరోపించారు.

ఆయన ఆరోగ్యం బాగోలేదని కుటుంబ సభ్యులు చెప్పినా పట్టించుకోలేదని, కనీసం మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులకు కనీసం ఫోన్‌లో కూడా అచ్చెన్నాయుడిని అందుబాటులో లేకుండా చేశారని, ఇది జగన్ ఉన్మాదానికి, పిచ్చికి పరాకాష్ఠ అని చంద్రబాబు అభివర్ణించారు.

‘‘ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండానే పోలీసులు అచ్చెన్నాయుడిని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు..’’ అని వ్యాఖ్యానించారు.

ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హోం మంత్రి, డీజీపీలే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

‘‘శాసనసభాపక్ష ఉప నేతగా ఉన్న అచ్చెన్నాయుడిని అర్థరాత్రి వేళ వచ్చి ఇంట్లోంచి ఎత్తుకుపోవడం చట్టాన్ని ఉల్లంఘించడం కాక మరేమిటి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారని, బీసీ సబ్ ప్లాన్ నిధులను మళ్లించారని చంద్రబాబు ఆరోపించారు.

సంక్షేమ పథకాల్లోనూ కోత విధించారు. ముఖ్యమైన నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు మొండిచేయి చూపించారు. వీటిపై శాసనసభలో ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నాయుడిపై కక్ష కట్టారని వ్యాఖ్యానించారు.

జగన్ ఉన్మాద చర్యలు, వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై బడుగు బలహీన వర్గాల ప్రజలు నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు కోరారు.

జ్యోతిరావు పూలే, అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించాలని సూచించారు. 

 

 

- Advertisement -