ఓటేసిన ప్రధాన ప్రత్యర్థులు, ఉండవల్లిలో చంద్రబాబు.. పులివెందులలో జగన్!

12:29 pm, Thu, 11 April 19
election-2019-chandrababu-ys-jagan

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చంద్రబాబు దంపతులతోపాటు ఆయన తనయుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణితో కలిసి వెళ్లి ఓటేసి వచ్చారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఉండవల్లిలో చంద్రబాబునాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తన తనయుడు నారా లోకేష్ పోటీచేస్తోన్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే సీఎం చంద్రబాబు కుటుంబం తమ ఓటు హక్కును వినియోగించుకోవటం విశేషం. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ లోనికి వెళ్లిన సమయంలో అక్కడున్న ఓ వృద్ధురాలిని చంద్రబాబు ఆప్యాయంగా కౌగిలించుకుని కాసేపు ఆమెతో మాట్లాడారు.

election-2019-chandrababu-family-caste-voteతిరిగి బయటికొచ్చిన తరువాత చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చంద్రబాబు కోరారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ బాధ్యతను అందరూ నెరవేర్చాలని ఆయన సూచించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఇటు రాష్ట్రంతోపాటు అటు దేశ భవిష్యత్తును నిర్దేశించేవి గనుక ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా సరైన నాయకులను, ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.

భార్య భారతితో కలిసి ఓటేసిన జగన్…

ఇక వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం కడప జిల్లా పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భాకారాంపురంలోని ఎంపీపీఎస్ స్కూల్ పాత భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి జగన్ తన భార్య భారతితో కలిసి వెళ్లి ఓటు వేశారు. బయటికొచ్చిన అనంతరం మాట్లాడుతూ.. ఈ దఫా రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకొంటున్నారని వ్యాఖ్యానించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో వ్యవస్థ మారాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ఈసారి వారు స్పష్టమైన తీర్పును ఇస్తారని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. జగన్ భార్య భారతి మాట్లాడుతూ… దేవుడు అనుకొన్నట్టుగానే ఈ ఎన్నికల్లో ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. నిజాయితీ, విశ్వసనీయత, యంగ్ అండ్ డైనమిక్ నాయకత్వం కోసం ఓటు వేయాల్సిందిగా ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.