నేనెంతకాలం బతుకుతానో నాకు తెలుసు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

7:31 am, Mon, 13 January 20

గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నరసరావుపేటలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. తాను ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని, కాబట్టి మరో 10-15 ఏళ్లు బతుకుతానని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఒక నేరస్తుడు సీఎం అయ్యాడని అన్నారు. రాష్ట్రానికి ఇంతగా చెడు చేసిన వ్యక్తులు మరెవరూ లేరన్నారు.

ఒక్క రాజధానికే దిక్కులేదని, ఈ సీఎం మూడు రాజధానులు కడతానని అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో ముందుకెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

‘‘సీఎం చూస్తే అలా.. మంత్రులేమో ఇలా..’’

కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతుందోని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు కోడి పందాలు, టిక్‌టాక్‌లు, ఎడ్ల పందాల్లో బిజీగా ఉంటే, ముఖ్యమంత్రి జగన్ వీడియో గేమ్స్‌లో బిజీగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. మహిళలను హింసించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

భోగి పండుగ రోజున జీఎన్ రావు, బోస్టన్ కమిటీలను భోగి మంటల్లో వేస్తే రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఇకపై ప్రతి ఒక్కరు తమ ఫోన్లలో ‘జై అమరావతి’ అనే రింగ్‌టోన్ పెట్టుకోవాలని, ఎవరైనా ఫోన్ చేసినా గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా ‘జై అమరావతి’ అని చెప్పాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.