నో డౌట్! టీడీపీదే గెలుపు, కేసీఆర్ ఫ్రంట్‌లో ఆ 2 పార్టీలే: చంద్రబాబు జోస్యం

chandrababu take on at YS Jagan and KCR, Newsxpressonline
- Advertisement -

ప్రకాశం: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుపై ఎలాంటి అనుమానం లేదని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఒంగోలులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ప్రజలంతా టీడీపీకి సానుకూలంగా ఉన్నారని అన్నారు.

ప్రకాశం జిల్లాలో ఆయకట్టు కాపాడే బాధ్యత తనదేనని చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి హత్య విషయంపైనా చంద్రబాబు స్పందించారు.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను తొలుత గుండెపోటు అని చెప్పారని.. దారుణంగా హత్య చేసి కప్పిపుచ్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. ఆస్పత్రిలోనూ అబద్ధాలు చెప్పారని.. కేసు కూడా అవసరం లేదన్నారని మండిపడ్డారు. వివేకా హత్యను దాచేందుకు ఎందుకు ప్రయత్నించారని చంద్రబాబు ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు వైసీపీ నైజమన్నారు. దోషులు ఎంత పెద్దవారైనా శిక్షలు పడతాయని పోలీసులు నిరూపించాలన్నారు.

కేసీఆర్ ఫ్రంట్ లో ఉండేవి ఆ 2 పార్టీలే..

‘తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసే ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఉండేది టీఆర్ఎస్, వైసీపీలు మాత్రమే. ఈ ఫెడరల్‌ ఫ్రంట్‌ పెట్టించింది మోడీయే. 17 సీట్లతో ఢిల్లీలో చక్రం తిప్పుతానని కేసీఆర్‌ చెబుతున్నవన్నీ మాయ మాటలే’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతేగాక, ‘పోలవరం ఆపాలని తెలంగాణ నేతలు పిటిషన్లు వేశారు. అభివృద్ధి చేసిన నాపైనే కేసీఆర్‌ అభాండాలు వేస్తున్నారు. తెలంగాణలో ఆయన చేస్తున్నవి దుర్మార్గమైన రాజకీయాలు. కాంగ్రెస్‌, టీడీపీ శాసనసభ్యులను కేసీఆర్‌ లాక్కుంటున్నారు’ అని చంద్రబాబు విమర్శించారు.

పోలవరాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్న టీఆర్ఎస్ పార్టీతో స్నేహం చేస్తున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో మరోసారి గెలిపించాలని ప్రజలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

 

- Advertisement -