మార్పు జగన్‌తోనే సాధ్యమా? ఏపీ ప్రజా తీర్పు.. ఎవరి వైపు??

3:52 pm, Wed, 10 April 19
YS Jagan Latest News, AP Latest Political News, AP Election News, Newsxpressonline

అమరావతి: ‘‘నాకూ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాను.. ఆ రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తీసుకొస్తాను..’’ ఎన్నికల ప్రచారం ముగింపు రోజున వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజానీకానికి చేసిన అభ్యర్థన ఇది. తొమ్మిదేళ్లుగా నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేయడం జగన్‌కి కలిసివచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

దేశంలో ఎవ్వరూ కనీ వినీ ఎరుగని విధంగా.. దాదాపు ఏడాదిన్నరపాటు ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరిట పాదయాత్ర చేసి, రాజకీయాలలో సరికొత్త రికార్డ్ సృష్టించారు వైఎస్ జగన్. పాదయాత్ర సమయంలో.. తన దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకున్న ప్రతి ఒక్కరిని ప్రేమతో దగ్గరికి తీసుకుని, ‘‘మీ సమస్యని నా సమస్యగా తీసుకుంటా.. అధికారంలోకి వచ్చిన వెంటనే తీరుస్తాను..’’ అంటూ హామీ ఇచ్చేవారాయన.

జగన్ పిలుపుతో ఆలోచనలో పడిన ప్రజలు…

అలాగే జగన్ ప్రకటించిన ‘నవరత్నాలు’ కూడా ఏపీ ప్రజలని ఆలోచనలో పడేశాయి. తన పథకాలతో బడుగు, బలహీన వర్గాల జీవితాలని సమూలంగా మార్చుతానని జగన్ హామీ ఇవ్వడం,  నవరత్నాలు అమలైతే అందరూ హాయిగా గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోవచ్చు అని, తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ఆయన అడగడం.. చూస్తుంటే.. మరి ఏపీ ప్రజలు జగన్ హామీని నమ్మి ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చి చూస్తారా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. 

జగన్ రాజకీయ ప్రస్థానం ఇలా…

ప్రస్తుతం జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన ప్రచారం ఏ విధంగా సాగిందో ఇప్పుడు చూద్దాం. జగన్ ప్రత్యక్ష రాజకీయాలలో కాలుమోపిన కొన్ని రోజులకే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. సీఎంగా ఉన్న తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం, ఆ తరువాత ఓదార్పు యాత్ర కోసం కాంగ్రెస్‌తో విభేదించడం, బయటికొచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం అన్నీ వరుసగా జరిగిపోయాయి. 

2012 మే 27న అక్రమాస్తులకు సంబంధించిన అభియోగాలపై సీబీఐ చేత అరెస్ట్ చేయబడ్డారు. 16 నెలల పాటు జ‌గ‌న్ చంచ‌ల్ గూడ జైలులో గడపాల్సి వచ్చింది. 2013 సెప్టెంబరు 23న నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు వైఎస్ జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

సమైక్యాంధ్రపై ఆదినుంచీ ఒకే మాటపై…

ఆ తరువాత మొండి ధైర్యంతో జగన్ ముందుకుసాగారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును, 48 ఏళ్ల వయస్సు మాత్రమే ఉన్న జగన్ ఢీ కొడుతున్నాడు. ఇక  సమైక్యాంధ్ర విషయానికొస్తే.. చివరివరకు జగన్ ఒకే మాటపై ఉన్నారు.

మిగిలిన కొంతమంది నేతలు రెండు ప్రాంతాల రాజకీయ లబ్ది కోసం రెండు విధాలుగా మాట్లాడినా, జగన్ మాత్రం ఆదినుంచీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నారు.  అలాగే ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధిలో దూసుకుపోతుందని భావించారు. ప్రత్యేక హోదా పై అవగాహనతో మాట్లాడారు, పోరాటాలు చేసారు.

ఇప్పటికీ ఏ జాతీయ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తుందో, ఆ పార్టీకే కేంద్రంలో తన మద్దతు అని ముక్తకంఠంతో చెబుతున్నారు. నిజానికి 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జగన్ ఏపీ ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు కానీ.. అధికారం చేపట్టేందుకు అది సరిపోలేదు. ఆ ఎన్నికల్లో మూడు ప్రత్యర్ది పార్టీలు కలిసి జగన్‌పై పైచేయి సాధించాయి.

ఎన్ని ఆరోపణలు చేసినా…

ఇక వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్లిన వారు.. జగన్‌పై సంచలన ఆరోపణలు చేసిన వారు ఎందరో. అయినా సరే వైఎస్ జగన్ వెరవలేదు, మడమ తిప్పలేదు. ప్రజలపై ఉన్న విశ్వాసంతో ఆయన ముందుకే సాగారు. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసింది, నేతల దయ వల్ల కాదని, అది ఏపీ ప్రజల ఆశీర్వాద బలం వల్లనేనని ఆయన గట్టి నమ్మకం. 

పాదయాత్ర ద్వారా ఏపీలో జగన్ పార్టీ మరింత బలం పుంజుకుంది.. విశ్వసనీయత పెంచుకుంది. పాలనా అనుభవం లేదు అని ఆరోపణలు చేసే వారికి.. ‘‘తొమ్మిదేళ్లుగా నిత్యం ప్రజలతో ఉన్నాను, ఇంతకంటే అనుభవం కావాలా?’’ అంటూ చెంప చెళ్లుమనేలా సమాధానం ఇచ్చారు జగన్. ఇక అవినీతి, అరాచకత్వం, కుమ్మక్కు అనే ఆరోపణలను కూడా వైఎస్ జగన్ చాలా సమర్థవంతంగానే తిప్పికొట్టారు.

ఒక్క ఛాన్స్.. ఇస్తారా?

ఒక్క అవకాశం ఇస్తే నా పాలన ఎలా ఉంటుందో ప్రజలకు చూపిస్తాను అనే జగన్ మాటలని ప్రజలు ఈసారైనా మన్నిస్తారా? లేదంటే అధికారానికి ఆయన్ని దూరంగానే పెడతారా అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.  అందరిలోనూ మార్పు రావాలి.. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి.. ఆ ఓటు కూడా మార్పు కోసమే వెయ్యాలి అని ఆశిద్దాం!