చిరంజీవికి హైకోర్టులో ఊరట: గత ఎన్నికల నాటి కేసు కొట్టివేత

10:11 am, Thu, 14 March 19
Chiranjeevi

అమరావతి: గత సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘ఎన్నికల ప్రవర్తన నియమావళి’ని ఉల్లంఘించారని పేర్కొంటూ మాజీ కేంద్రమంత్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై గుంటూరు అరండల్‌పేట్‌ పోలీస్ స్టేషన్‌లో 2014లో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది.

సమయం దాటిన తర్వాత ప్రచారం చేశారంటూ..

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజనీ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 2014 ఏప్రిల్‌ 27 రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారంటూ చిరంజీవిపై అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ వ్యవహారమై దాఖలు చేసిన అభియోగపత్రాన్ని దిగువ కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అక్రమంగా పిటిషనర్‌పై కేసు నమోదు చేశారన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. చిరంజీవిపై నమోదు చేసిన కేసును రద్దు చేశారు. కాగా, చిరంజీవి తరపున సీనియర్ న్యాయవాది గంగయ్యనాయుడు వాదనలు వినిపించారు.

చదవండి: లోకేష్ పోటీ చేసే స్థానంపై చంద్రబాబు క్లారిటీ: ఎక్కడ్నుంచో తెలుసా?